నస్పూర్, వెలుగు : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ కుమార్‌దీపక్ రైతులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్ లో అడిషనల్కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ లతో కలిసి వరి ధాన్యం కొనుగోలు వాల్ పోస్టర్ల ఆవిష్కరించి మాట్లాడారు. గ్రేడ్ ‘ఏ’ వడ్లు క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,369 మద్దతు ధర నిర్ణయించామన్నారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్చెల్లిస్తున్నామన్నారు. జిల్లాలో 4 ఏజెన్సీల ద్వారా 301 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 147, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 91, మెప్మా పరిధిలో 7, డీసీఎంఎస్ పరిధిలో 56 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సమకూర్చామన్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షల 32 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, వసతి, మూత్రశాలలు సరిపడా ఉండాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోతే ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించాలన్నారు.
