
- అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలి
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా అడిషనల్కలెక్టర్ మధుసూదన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి, వైద్య, పోలీస్, వాటర్బోర్డు, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 242 కేంద్రాల్లో ఏర్పాటు చేస్తుండగా.. లక్షా 74 వేల 368 మంది స్టూడెంట్లు హాజరవుతున్నారని తెలిపారు. స్టూడెంట్లకు ఇబ్బందులు రాకుండా స్పెషల్ బస్సులను నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదని స్పష్టంచేశారు. సెంటర్ల సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు తమ పూర్తి సహకారాన్ని అందించాల్సిందిగా కోరారు. సమావేశంలో డీసీపీ బాబురావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి వడ్డెన్న, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, మెడికల్ ఆఫీసర్ వెంకటి, వివిధ శాఖల అధికారులు
పాల్గొన్నారు.