
ఖమ్మం టౌన్, వెలుగు : ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేరుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఆయిల్ పామ్ సాగు, వ్యవసాయ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. గత ఎనిమిది నెలల్లో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ రెట్టింపు అయ్యిందన్నారు. ఆయిల్ పామ్ పంటకు కోతుల బెడద ఉండదని, వరదలు వచ్చినా సమస్య ఉండదని, నాలుగేండ్ల వరకు అంతర పంటల ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు.
వ్యవసాయ విస్తరణ అధికారి తన క్లస్టర్ లోని ప్రతీ గ్రామంలో కనీసం 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో వచ్చే వారం నుంచి రెగ్యులర్ గా 40 మంది రైతులకు ఒక బస్సు కేటాయించి ఫీల్డ్ విజిట్ చేసేలా చూడాలన్నారు. అనంతరం ఆయిల్ పామ్, ఉద్యానశాఖ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.
న్యాచురల్ ఫార్మింగ్ ను ప్రోత్సహించాలి
జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లో న్యాచురల్ ఫార్మింగ్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ క్లస్టర్ వారీగా చేపట్టిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొలాల్లో ఉన్న లోపాలను పరిశీలించి న్యాచురల్ గా అధిగమించే చర్యలను రైతులకు వివరించాలని చెప్పారు. అటువంటి పంటకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దగ్గర ప్రత్యేక ఆర్గానిక్ మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
స్థలాలు గుర్తించాలి
జిల్లాలో పలు అభివృద్ధి, నిర్మాణాల పనులకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై రఘునాథపాలెం మండలంలో ఆయన పర్యటించారు. టీటీడీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కోసం పువ్వాడ ఉదయ్ నగర్ గుట్ట పైకి ఎక్కి అనువైన స్థలం, రహదారికి మార్గాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలోని స్థలాల మ్యాప్ లను సిద్ధం చేయాలని ఆఫీసర్లు ఆదేశించారు.