
వైరా, వెలుగు: పైలెట్ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని కలెక్టర్ సోమవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు చెప్పారు.
పైలట్ గ్రామాల్లో 875 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మంజూరు చేసిన ఇండ్లలో 568 ఇండ్లు పునాదుల స్థాయి, 442 బేస్మెంట్ పూర్తి, 70 ఇండ్లు రూఫ్ స్థాయి, 5 స్లాబ్ స్థాయిలో ఉన్నట్లు 420 మందికి చెల్లింపులు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, హౌజింగ్ డిఇ పి. సాయిరాం పాల్గొన్నారు.
ఖమ్మం టౌన్,వెలుగు: కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు రాజీవ్ యువ వికాసంతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందివ్వాలని ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి అర్జీలను స్వీకరించారు.
గ్రీవెన్స్ లో ప్రజల నుంచి 80 కిపైన దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్వో ఏ. పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, అధికారులు, కలెక్టరేట్ ఏఓ అరుణ, తదితరులు పాల్గొన్నారు.