మన ఊరు- మన బడి పనుల సమీక్షలో అధికారులకు కలెక్టర్​ హెచ్చరిక

మన ఊరు- మన బడి పనుల సమీక్షలో అధికారులకు కలెక్టర్​ హెచ్చరిక

నిజామాబాద్, వెలుగు: వారం రోజుల్లోపు జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన 114 పాఠశాలల్లో పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యంగా ఉన్న రెంజల్ మండల విద్యా శాఖ అధికారి రామ్ మోహన్ ను సస్పెండ్ చేయాలన్నారు. మరో ఏడు మండలాలకు చెందిన ఏఈలకు, రుద్రూర్ ఎంఈఓకు మెమోలు జారీ చేశారు . న్యూ కలెక్టరేట్​ లో శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మన ఊరు - మన బడి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు.   మండలాల వారీగా పనులపై ఆరా తీశారు. పనుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ లేకుండా నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు.   పనులకు నిధుల కొరత లేదని, దశల వారీగా పూర్తయిన వెంటనే బిల్లులు మంజూరు చేస్తున్నామన్నారు. వారంలో పనులు పూర్తి కకపోతే ఏఈలను బాధ్యులు గా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సులో అడిషనల్​ కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్, మెప్మా పీ.డీ రాములు, డీఈ ఓ దుర్గాప్రసాద్, కార్మిక శాఖ అధికారి యోహాన్, డీపీవో జయసుధ పాల్గొన్నారు. 
‘డబుల్​’ ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం

వర్ని, వెలుగు: డబుల్‌‌బెడ్‌‌రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం అని స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి పేర్కొన్నారు.  మండల కేంద్రంలోని సీసీడీ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌‌ పోచారం పాల్గొన్నారు. డబుల్‌‌బెడ్‌‌రూం ఇండ్ల లబ్దిదారులకు స్పీకర్‌‌ పోచారం చెక్కులు అందించారు. ఈ సందర్భంగా స్పీకర్‌‌ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదివేల డబుల్‌‌బెడ్‌‌రూం ఇండ్లు మంజూరు కాగా వీటిలో ఐదువేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్‌‌,ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
బయోమెట్రిక్ విధానాన్ని  అమలు చేయాలి

నిజామాబాద్ టౌన్, వెలుగు: బీఈడీ కాలేజీల్లో అటెండెన్స్ పెంచేందుకు  బయోమెట్రిక్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ విద్యార్థి పరిషత్, ఎన్ ఎస్ యూ ఐ, లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్  ప్రతినిధులు బొబ్బిలి కల్యాణ్​, సాయి కృష్ణ, శివ, గణేశ్​ మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఈడీ కాలేజీల్లో రూల్స్​ పాటించడం లేదని ,  డబ్బులు ఇస్తే  కాలేజీలకు రావాల్సిన అవసరం లేదని బహిరంగంగానే ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

సర్వేచేసి సమస్యను పరిష్కరిస్తాం

సిరికొండ,వెలుగు: సిరికొండ శివారులోని 532 సర్వే నంబర్​లో ల్యాండు సమస్యను డీజీపీఎస్​ ద్వారా సర్వే చేయించి న్యాయం చేస్తామని జాయింట్​ కలెక్టర్​ చంద్రశేఖర్, డీఎఫ్​వో వికాస్​ మీనన్​అన్నారు. శుక్రవారం తహసీల్దార్​ ఆఫీస్​లో  ఫారెస్టు, రెవెన్యూ ఆఫీసర్లు రికార్డులను పరిశీలించారు. అనంతరం భూమిని పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. 
ఈ కార్యక్రమంలో ఎఫ్​డీవో భావని శంకర్​, ఆర్​డీవో రవి ,ఏఐకేఎంఎస్​ జిల్లా కార్యదర్శి
 రామకృష్ణ, రమేష్​, బాబన్న, సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సమస్యలు పరిష్కరించడంలో సర్కార్​ విఫలం

కాగజ్ నగర్,వెలుగు: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్​సర్కార్​విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. దహెగాం మండలం లగ్గామ పెద్దవాగు వంతెన అప్రోచ్ రోడ్డు, అందవెల్లి వంతెన కోసం శనివారం నుంచి పాదయాత్ర చేస్తున్నటలు ఆయన తెలిపారు. శుక్రవారం కాగజ్​నగర్​లోని పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులపాటు యాత్ర కొనసాగుతుందన్నారు. ముగింపు సభకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు హాజరవుతారన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలెం వెంకటేశ్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మేడి కార్తీక్, ఉపాధ్యక్షుడు సుధాకర్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి డొంగ్రి అరుణ్, ఉపాధ్యక్షుడు కుమ్మరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్​సీల అభివృద్ధికి నిధులు

ఎల్లారెడ్డి,వెలుగు : ప్రైమరీ హెల్త్​ సెంటర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు
 చేస్తుందని, ఈ నిధులను వాడుకొని హాస్పిటల్ అభివృద్ధికి చేయాలని కామారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్ఓ శోభారాణి సూచించారు. ఎల్లారెడ్డి మండల్ మత్తమల్ పీహెచ్ సీ లో శుక్రవారం హాస్పిటల్ డెవలప్​మెంట్​ సొసైటీ మీటింగ్​ నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా శోభారాణి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హాస్పిటల్ కోసం మంజూరు చేస్తున్న ఫండ్స్ ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాదవి, జడ్పీటీసీ ఉషగౌడ్, వైస్ ఎంపీపీ నర్సింలు పాల్గొన్నారు. 

భారత్​ జోడో యాత్ర రూట్​ పరిశీలన

పిట్లం, వెలుగు: నవంబర్​ 6న జిల్లాలో జరిగే  భారత్​ జోడో పాదయాత్ర రూట్​ను రాష్ట్ర కాంగ్రెస్​ ఇన్​చార్జి మాణిక్కం ఠాకూర్​ శుక్రవారం పరిశీలించారు.  జుక్కల్​ నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పిట్లం చౌరస్తాలో జిల్లా ప్రసిడెంట్​ కైలాశ్​ శ్రీనివాస్​ ఆయనకు స్వాగతం పలికారు.    అక్కడి నుంచి వెళ్లి,  పెద్దకొడప్​గల్​లో సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం మద్నూర్​లో మార్కెట్​ స్థలాన్ని పరిశీలించి స్థానిక నాయకులకు సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సౌదాగర్​ గంగారాం, మాజీ ఎంపీ సురేశ్​​ షెట్కార్​, కామారెడ్డి టౌన్​ ప్రెసిడెంట్​ పండ్ల రాజు, జుక్కల్​ యూత్​ ప్రెసిడెంట్​  ఇమ్రోస్​, పిట్లం, మద్నూర్​ ప్రెసిడెంట్లు జంబిగె హన్మాండ్లు, రమేష్​ ఉన్నారు.

గురుకుల కాలేజీని తరలించొద్దు
ఆర్మూర్, వెలుగు : మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కాలేజీని  ఆర్మూర్ లోనే కొనసాగించాలని  ఆర్మూర్ పీడీఎస్​యూ నాయకులు  డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా  పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్  మాట్లాడుతూ ఆర్మూర్ టౌన్​ లో ఉన్న మహాత్మ జ్యోతి బాపులే గురుకుల గర్ల్స్​ స్కూల్ ను మునిపల్లి లో ఉన్న ఎస్ ఆర్​ ఇంజినీరింగ్ కాలేజ్ లో మూతపడ్డ బిల్డింగ్​ లోకి మార్చడం సరి కాదన్నారు.   అధికారులు ఈ  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్​యూ ఏరియా ప్రెసిడెంట్​అనిల్ కుమార్,  ప్రధాన కార్యదర్శి నిఖిల్, ఏరియా ఉపాధ్యక్షులు నవీన్ పాల్గొన్నారు.