అబద్ధాలు చెప్పకండి! అధికారులపై హైదరాబాద్ కలెక్టర్ సీరియస్

అబద్ధాలు చెప్పకండి! అధికారులపై హైదరాబాద్ కలెక్టర్ సీరియస్
  • రెండు గంటలు టైమ్ కేటాయించలేరా?
  • అప్లికేషన్లు పెండింగ్​లోఎందుకు ఉంటున్నయ్ 
  • హాజరుకాని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వండి 
  • వచ్చే మీటింగ్​కు సబార్డినేట్స్​ను పంపొద్దు  
  • ప్రజావాణిలో అధికారులపై కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం

హైదరాబాద్​, వెలుగు: ‘ప్రజావాణి టైమ్ లోనే మీకు పనులుంటాయా ?  ఏమైనా పనులుంటే పొద్దున పెట్టుకోండి. లేదా సాయంత్రం 
పెట్టుకోండి. ప్రజావాణి ఉండేదే రెండు గంటలు. అటెండ్ ​కాని అధికారులకు నోటీసులు ఇస్తాం.” అని హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్​ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్​లో ప్రజావాణిపై రివ్యూ మీటింగ్ జరిగింది. వివిధ డిపార్టుమెంట్ల అధికారులు హాజరై తమ పరిధిలోని ప్రజావాణి అప్లికేషన్ల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని  మండలాల తహశీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు.

జిల్లా, మండల ఆఫీసుల్లో పదుల సంఖ్యలో ప్రజావాణి అప్లికేషన్లు పెండింగ్​లో ఉండడంపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జీతాలు తీసుకోవట్లేదా? సరిపోను స్టాఫ్​ఉన్నారుగా? మరెందుకు అప్లికేషన్లు పెండింగ్​లో ఉంటున్నాయి ? హోమ్​వర్క్​ చేయండి? స్కూల్​ పిల్లలకు చెప్పినట్లు ప్రతి రోజూ చెప్పాల్నా..?’ అని ఆయన ప్రశ్నించారు. ‘పెండింగ్​అప్లికేషన్లు 3 రోజుల్లో పూర్తి చేయాలి. లేదంటే సాలరీలు నిలిపివేస్తా’ .. అని కలెక్టర్ అధికారులపై సీరియస్ అయ్యారు. 

సబార్డినేట్స్ రావొద్దు 

తర్వాతి​ మీటింగ్​కు అధికారులే రావాలని, సబార్డినేట్స్​ను పంపొద్దని కలెక్టర్​ స్పష్టంచేశారు.  రివ్యూ మీటింగ్​కు రాని వారికి షోకాజ్​నోటీసులు ఇస్తామని, ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే పర్మిషన్​ తీసుకోవాలని సూచించారు. రివ్యూ ఉందని తెలిసి కూడా పెండింగ్​అప్లికేషన్స్​పట్టుకొని కలెక్టరేట్​కు రావడం సరికాదని, మళ్లీ రిపీట్​కావొద్దని సూచించారు. జిల్లాలోని ఓ శాఖ ఆఫీసులో 70 ప్రజావాణి అప్లికేషన్లు పెండింగ్​​లో ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  

ఆరుగురు సిబ్బంది ఉండి కూడా అన్ని అప్లికేషన్లు పెండింగ్​లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అసలు ఆఫీసులకు వస్తున్నారా..? అనే అనుమానం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​తహశీల్దార్ లో 23, మెజిస్ట్రేట్​ఎంక్వైరీ11, సీడీపీ7, పెన్షన్లు తదితర డిపార్టుమెంట్లలో పెండింగ్​అప్లికేషన్లు ఉన్నాయని, మూడు రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణికి 98 అర్జీలు

ఎల్​బీనగర్: కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 98 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు.  సోమవారం  హైదరాబాద్​ కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణిలో మొత్తం 30  అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.  హౌసింగ్​కు చెందినవి 20 ఉండగా, ఇతర శాఖలవి15 ఉన్నాయని చెప్పారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్​ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవోలు సూర్య ప్రకాశ్, రవి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.