
కందనూలు, వెలుగు: అనుమతి లేని బీటి-3 నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు టాస్క్‌పోర్స్ టీమ్‌లు విస్తృత తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. నకిలీ పత్తి విత్తనాల నియంత్రణపై సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో అధికారులు, పోలీస్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్మాట్లాడుతూ.. జూన్ నెల ముందుగానే వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జిల్లా 2 లక్షల 86 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు.
జిల్లాకు 2,865 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే 573 క్వింటాళ్ల విత్తనాలను సరాఫరా చేశామన్నారు. పత్తి విత్తనాలను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినా, నకిలీ విత్తనాలు విక్రయించినా చట్టరీత్యా నేరమని తెలిపారు. విస్తృత తనిఖీలు చేపట్టాలని, చెక్‌పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.