
కరీంనగర్ టౌన్/కొత్తపల్లి వెలుగు: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే టీచర్లు నిరంతరం నేర్చుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం కరీంనగర్ సిటీలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో ట్రస్మా బాధ్యులు యాదగిరి శేఖర్ రావుతో కలిసి ఉత్తమ టీచర్లను సన్మానించి, సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు గుడ్, బ్యాడ్ టచ్, నైతిక విలువలు బోధించాలన్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి చదువుకునేలా చూడాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం గమనించాలని సూచించారు. తమను సంప్రదిస్తే ప్రభుత్వం తరఫున ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు సైతం ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్(ఎస్‌హెచ్‌వోఆర్)లో అన్ని స్కూళ్లు పాల్గొనాలని సూచించారు.
అనంతరం ముకరంపురలోని ఓల్డ్ హైస్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ బిల్డింగ్‌ను స్టూడెంట్లకు ఉపయోగపడేలా సైన్స్ మ్యూజియంగా మార్చుకుందామన్నారు. సైన్స్ మ్యూజియంలో రోబోటిక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, కంప్యూటర్ ల్యాబ్ కోసం ప్రత్యేక గదులు, విద్యార్థుల కోసం సెమినార్ హాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీ, ట్రస్మా బాధ్యులు, సమగ్ర శిక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అశోక్, జైపాల్‌రెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.