రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

చిలప్​చెడ్, వెలుగు: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.  భూభారతి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా సోమవారం చిలప్​చెడ్ మండలం రహీంగూడ, రాందాస్ గూడలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. 

తొలి రోజు భూ సమస్యలకు సంబంధించి 43 ఆర్జీలు వచ్చినట్లు తెలిపారు. సదస్సు నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భూ సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ గన్య తండాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలాని సూచించారు. సదస్సులో ఆర్టీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు పాల్గొన్నారు.

 ఆటపాటలతో విద్యా బోధన చేయాలి

నర్సాపూర్: ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్​కు ఆటపాటలతో విద్యా బోధన చేయడం హర్షనీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండలంలోని అద్మాపూర్ ప్రాథమికోన్నత స్కూల్​ను పరిశీలించి టీచర్​రవిరాజు బోధన పద్ధతుల గురించి తెలుసుకొని హర్షం వ్యక్తంచేశారు. ఎంఈవో ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి స్కూల్ నిర్వహణ, పిల్లల విద్యా ప్రమాణాలు పెంచడానికి పలు సూచనలు చేశారు.  అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు.