ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

తిర్యాణి, వెలుగు : ఆదివాసీ సంస్కృతి ఎంతో గొప్పదని కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఐటీడీఏ పీఓ వరుణ్​ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఎదులపాడ్ లో వెడ్మ రాము వర్ధంతికి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా వెడ్మ రాము విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన గిరిజనులకు భూమి పట్టాలు ఇచ్చేందుకు సర్వే చేస్తున్నట్టు తెలిపారు.  చదువుతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని , అందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి మాట్లాడుతూ వచ్చే వర్ధంతికి వెడ్మ రాము కాంస్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆదివాసీ బిర్డ్ గోండ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు స్థానికులు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు , ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ ఆత్రం చందు, వెడ్మ తిరుపతి, సంతోష్​, దశ్రు పాల్గొన్నారు. 

గనిలో ఎస్డీఎల్​ మిషన్​ నడిపిస్తే ఊరుకోం

మందమర్రి, వెలుగు: మందమర్రి ఏరియా కాసీపేట- 2 గనిలో ప్రైవేటు ఎస్డీఎల్​ మిషన్ల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం చేపట్టిన ప్రయత్నాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాసీపేట- 2 గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎండి.అక్బర్​అలీ, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్​, బెల్లంపల్లి ఇన్​చార్జి చిప్ప నర్సయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను ప్రోత్సాహిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో ఎంప్లాయీస్​కు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. కాసీపేట-2 గనిలో ప్రైవేటు కాంట్రాక్టర్​ ద్వారా ఎస్డీఎల్​ మిషన్లను ఏర్పాటు నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. గని ఆవరణలో రోడ్లు, ఎంప్లాయిస్​కు రెస్ట్​ హాల్​, బ్యాంకేడ్, మ్యాన్​రైడింగ్​ సౌలత్​లు కల్పించాలన్నారు. ధర్నా అనంతరం గని మేనేజర్​ రవిందర్​కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్​ ప్రెస్​డెంట్లు బియ్యాల వెంకటస్వామి, ఇప్పకాయల లింగయ్య, పులి శంకర్, బొంకూరి రాంచందర్​, బొద్దుల వెంకటేశ్​, రత్నం అయిలయ్య, తీర్థాల చంద్రయ్య, దినేశ్ తదితరులు పాల్గొన్నారు. 

చేనేత కార్మికులకు ఎమ్మెల్యే నరేందర్ క్షమాపణ చెప్పాలి

బెల్లంపల్లి /ఆదిలాబాద్​టౌన్​/ బోథ్​, వెలుగు : చేనేత కార్మికులందరికీ వరంగల్ తూర్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ క్షమాపణ చెప్పాలని బెల్లంపల్లి, ఆదిలాబాద్​, బోథ్ లో పద్మశాలి నాయకులు బుధవారం నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు బైపోల్ లో ప్రచారం చేస్తూ చేనేత మగ్గాల మీద కాలుపెట్టి చేనేతలను అవమానపర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, జాతీయ చేనేత ఐక్య వేదిక నాయకులు, కొండబత్తిని రామ్మోహన్, డీకొండ రాజలింగు, కొలిపాక శ్రీనివాస్, నర్మెట్ట సదాశివం, దేవసాని ఆనంద్, రవి తదితరులు పాల్గొన్నారు. 

సీఎస్​ఆర్​ ఫండ్స్​ను సక్రమంగా వినియోగించాలి

మందమర్రి/నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థ వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తున్న సీఎస్​ఆర్​ ఫండ్స్​ను సక్రమంగా వినియోగించాలి  సింగరేణి ఫైనాన్స్​ డైరెక్టర్​ ఎన్​.బలరాం నాయక్​ అన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. సీఎస్​ఆర్​ ఫండ్స్​పై సమీక్షించారు. ఈ సందర్భంగా మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు చింతల శ్రీనివాస్​, బి.సంజీవరెడ్డి, దేవేందర్​ ఫండ్స్ వినియోగం, చేపట్టిన పనులపై మాట్లాడారు. టార్గెట్​ లోపు పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల ఏస్వోటుజీఎంలు సీహెచ్. కృష్ణారావు, గుప్తా, ఏజీఎంలు చక్రవర్తి, మురళీధర్​, డీజీఎంలు సివిల్​ శ్రీనివాసులు, శివరావు, గోవిందరాజు(పర్సనల్​), సీనియర్​ పీవో మైత్రేయబంధు, ఐటీ ఆఫీసర్లు రవి, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు. 

గోదాంలలో రికార్డులను సరిగా నిర్వహించాలి

లోకేశ్వరం, వెలుగు : గోదాంలలో బియ్యం నిల్వల రికార్డులను సరిగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ బి. రాంబాబు సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని గోదాంలను బుధవారం ఆయన తనిఖీ చేశారు.  బియ్యం చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఈయన వెంట తహసీల్దార్​ సరిత, డీఎస్ ఓ శ్రీలేఖ, సిబ్బంది ఉన్నారు.

సింగరేణిలో విజిలెన్స్ ​అవగాహన వారోత్సవాలు

నస్పూర్​,వెలుగు: సింగరేణి వ్యాప్తంగా ఈనెల 31 నుంచి నవంబర్​ 6 వరకు విజిలెన్స్​ అవగాహన వారోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. బొగ్గు గనులు, ఓసీపీలు, డిపార్ట్​మెంట్లపై వారోత్సవాల్లో భాగంగా 31న ఎంప్లాయిస్​తో పౌరుల సమగ్రత ప్రతిజ్ఞ చేయించాలన్నారు.  సింగరేణి స్కూల్, పాలిటెక్నిక్​ కాలేజీ స్టూడెంట్లకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని, జనవరి 26న జరిగే రిపబ్లిక్​డే వేడుకల్లో ప్రైజ్​లు అందించనున్నామని జీఎం తెలిపారు. విజిలెన్స్​ అవగాహన వారోత్సవాలను ఎంప్లాయిస్​, ఆఫీసర్లు విజయవంతం చేయాలని కోరారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నిర్మల్, వెలుగు: ఈద్గాం కౌట్లకే రోడ్డు పనులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 8 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పిస్తోందని చెప్పారు. నిర్మల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామని, ఈ నాలుగు కోట్లతో  పారామూరు –కదిలి ఆలం వరకు రోడ్డు నిర్మాణ పనులకు అనుమతి వచ్చిందని  చెప్పారు. అలాగే రూ. తొమ్మిది కోట్లతో  బందరు నుంచి కౌట్లవి వరకు  డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోస్టు కార్డు పంపారు.