ఏడుపాయల జాతర వైభవంగా జరపాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

ఏడుపాయల జాతర వైభవంగా జరపాలి :  కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: ఏడుపాయల వనదుర్గమ్మ జాతర వైభవంగా నిర్వహించాలని, ఇందుకోసం అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ​రాహుల్​రాజ్​ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్, ఏఎస్పీ మహేందర్​తో కలిసి జాతరపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. భక్తులకుఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. 

పార్కింగ్, విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు జాతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు మరుగుదొడ్లు శుభ్రం చేయాలని, చెత్త సేకరించాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, ఫాగింగ్​చేపట్టాలని సూచించారు. రవాణా సౌకర్యం, గజ ఈతగాళ్లు, అన్నిచోట్లా సీసీ కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్, వివిధ స్టాల్స్, క్యూలైన్ ఏర్పాటుపై ఫోకస్​పెట్టాలన్నారు. అధికారులు శనివారం ఏడుపాయలకు వెళ్లి జాతరకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  

రంజాన్ కు ఏర్పాట్లు చేయాలి

రంజాన్ ప్రశాంతంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో రంజాన్ మాసం ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్​నగేశ్, ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, నర్సాపూర్​ ఆర్డీవో మహిపాల్​ రెడ్డి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ప్రార్థన మందిరాల వద్ద శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ను నియంత్రించి, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మసీదుల వద్ద డ్రైనేజీలు, అప్రోచ్ రోడ్డు గుంతలు పడి ఉంటే మరమ్మతు చేయించాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. 

కలెక్టరేట్​లో మీడియా సెంటర్ ప్రారంభం

మెదక్ కలెక్టరేట్​లో మీడియా సెంటర్​ను కలెక్టర్​ రాహుల్ రాజ్​గురువారం ప్రారంభించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై  మీడియా సెంటర్ ద్వారా  నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు.