
మెదక్ (నర్సాపూర్), వెలుగు: ఆకుపచ్చ తెలంగాణ అందరి లక్ష్యం కావాలని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పరిష త్ హై స్కూల్ ను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ రహిత ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందన్నారు.
నర్సాపూర్ ప్రభుత్వ కాలేజీ వద్ద వెయ్యి మొక్కలు నాటామని, ప్రతి విద్యార్థి వాటి సంరక్షణకు శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యమైన మెనూ అందించడంలో రాజీ పడొద్దని సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి పీహెచ్ సీని తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు.
స్వాతంత్ర్య దినోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
మెదక్ టౌన్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్సూచించారు. మెదక్కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేదికతో పాటు వీఐపీలు, అధికారులు, మీడియా, ఇతరులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో రమాదేవికి సూచించారు.
తాగునీరు, పారిశుధ్యానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వ ఆఫీసులను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్వో భుజంగరావు, ఆర్డీవో రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.