ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్ కు మ్యాథ్స్ చెప్పిన కలెక్టర్

 ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్ కు మ్యాథ్స్ చెప్పిన కలెక్టర్
  • పెద్దశంకరంపేటలో స్కూళ్లు, పీహెచ్​సీ తనిఖీ చేసిన కలెక్టర్​ రాహుల్​ రాజ్​
  • విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ 

మెదక్​ టౌన్​, పెద్దశంకరంపేట, వెలుగు :  మెదక్​ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో  విద్యార్థుల నమోదు శాతం పెరగాలని జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. ఈ మేరకు గురువారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్​ హైస్కూల్​ను కలెక్టర్​ రాహుల్​ రాజ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలను విన్న కలెక్టర్​ అనంతరం తాను టీచర్​గా మారి విద్యార్థులకు మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్​ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

మంచి భోజనంతో పాటు నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలతోనే సాధ్యమన్నారు.  అనంతరం పెద్దశంకరంపేట పీహెచ్​సీని కలెక్టర్​ పరిశీలించారు. సెలవు రోజుల్లో కూడా  డాక్టర్లు , సిబ్బంది  ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. పీహెచ్​సీలోని హాజరు పట్టికను పరిశీలించారు.  ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు..  మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు రాకుండా దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టర్​ వెంట విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.