ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆసిఫాబాద్, వెలుగు : పశువుల ఆరోగ్య పరిరక్షణ,  పోషణ పద్ధతులపై  అధికారులు ప్రత్యేక దృష్టి  పెట్టాలని,   రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టర్ ఛాంబర్ లో పశు వైద్య, సంవర్ధక శాఖ  ఏడీ  సురేశ్​తో కలిసి పాడి పశువుల ఆరోగ్య రక్షణ,  లంపి స్కిన్​ నివారణపై శుక్రవారం అవగాహన పోస్టర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్​ మాట్లాడుతూ..  ఆవు, గేదె జాతిలో సూక్ష్మ క్రిమి, కీటకాల ద్వారా వ్యాప్తి చెందే  లంపిస్కిన్​  సోకినప్పుడు 2, 3 రోజులపాటు జ్వరం ఉంటుందని, శరీరం పై  కురుపులు వస్తాయని,  పాల ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుందని తెలిపారు .ఈ వ్యాధి సోకిన పశువును మంద నుండి వేరుచేసి , పశు వైద్యుల సూచన మేరకు వెంటనే చికిత్స అందించాలని, వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని చెప్పారు. కొత్తగా మందలోకి చేర్చే ముందు పశువులను 15 రోజుల పాటు వేరుగా ఉంచాలని చెప్పారు.  పశువులు ఉండే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు,  అవసరమైన మందులు పిచికారి చేయాలని తెలిపారు.

కోటి దీపోత్సవం సక్సెస్​ చేయండి
భైంసా, వెలుగు ; భైంసాలోని సుభద్రవాటిక సరస్వతీ శిశు మందిర్​ స్కూల్​లో ఈ నెల 31న భారత్​ దర్శన్​ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవాన్ని భక్తులు సక్సెస్​ చేయాలని భారత్​ దర్శన్​ జిల్లా అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్​ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శిశు మందిర్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరీ పీఠధాపతి కమలానంద భారతి స్వామితో పాటు ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు భారత్​ దర్శన్​ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కమిటీ సభ్యులు నిజాం వేణుగోపాల్​, పెండప్​ కాశీనాథ్​, ప్రిన్సిపాల్​ దేవేంధర్​ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రపతిని కలిసిన ఎంపీ సోయం
ఆదిలాబాద్​టౌన్​, వెలుగు :
 రాష్ర్ట పతి ద్రౌపది ముర్ము ను ఎంపీ సోయం బా రావు శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఆదివాసీ హక్కులను పరిరక్షించాలని వినతి పత్రం అందజేశారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో జనవరిలో దేశంలోనే పెద్దదైన గిరిజన ఉత్సవంగ నాగోబా జాతర ను నిర్వహిస్తామని దీనికి హాజరు కావాలని ఆమెను కోరారు. ఎంపీ వెంట ఆదివాసి రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోవ మనోహర్  తదితరులు ఉన్నారు. 

కాళేశ్వరం ముంపు రైతులను ఆదుకోండి  
చెన్నూర్​, వెలుగు :
కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో  చెన్నూర్​ నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని,  వారిని ఆదుకోవాలని బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ సుద్దపల్లి సుశీల్​కుమార్​  డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్​కు పోస్టుకార్డు పంపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూర్​ నియోజకవర్గంలోని   మూడేండ్లుగా పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ముంపు భూములను ప్రభుత్వం సేకరించి రైతులకు ఎకరానికి రూ. 30 లక్షలు చెల్లించాలని, ఇప్పటివరకు జరిగిన పంట నష్టానికి పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.  నియోజకవర్గంలోని ముంపు రైతులతో సీఎం కేసీఆర్​కు పోస్టుకార్డులు పంపుతామని ఆయన తెలిపారు.  

మహిళల ఆర్థిక సాధికారతతోనే దేశాభివృద్ధి
నస్పూర్, వెలుగు :
మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే  దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. నస్పూర్ లోని సింగరేణి గార్డెన్స్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రుణ వితరణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 35 కోట్ల రూపాయల చెక్కులను అందించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రభుత్వం జిల్లాకు రూ. 358 కోట్ల కేటాయించగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రూ. 253 కోట్ల అందిస్తున్నట్టు తెలిపారు. దీంతో రూ. 30 కోట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి, రూ. ఐదు కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అందించినట్టు వివరించారు. ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యాలను ఇప్పటికి 60 శాతం సాధించామని ఆమె తెలిపారు.

రుణం తీసుకున్న సభ్యులు చిన్న పరిశ్రమలు, కంగన్ హాల్, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్, క్లాత్ స్టోర్స్, కూరగాయల అమ్మకం లాంటివి ప్రారంభించాలని సూచించారు. మహిళలు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీ పై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్తు అంతా సాంకేతికతపై ఆధారపడి ఉంటుందన్నారు. మహిళలంతా జిల్లా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలన్నారు.  కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి.శేషాద్రి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ కె. వి. ప్రసాద్, రీజనల్ మేనేజర్ మురళీ మనోహర్, జిల్లా లీడ్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఏపీడీ శ్రీనివాస్, పీడీ మెప్మా బాలకృష్ణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సత్యవతి, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

విద్యార్థుల్లో స్కిల్స్​పెంచేందుకే  హ్యాకథాన్​
భైంసా (బాసర), వెలుగు :
విద్యార్థుల్లో దాగి ఉన్న స్కిల్స్​ను గుర్తించి,   డెవలప్​ చేసేందుకు ఇన్నోవేటివ్​ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ట్రిపుల్​ ఐటీ డైరెక్టర్​ సతీశ్​​ కుమార్​ అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన హ్యాకథాన్​ 2022 కార్యక్రమంలో   తెలంగాణ నుంచి 13 మంది విద్యార్థులు సెలక్ట్​ అవగా.. బాసర ట్రిపుల్​ఐటీ నుంచి హార్షవర్ధన్​, శ్రీరామ్​ అభినవ్​, శివరాంరెడ్డి ఎంపికైనట్లు వీసీ వెంకటరమణ, డైరెక్టర్​ సతీశ్​​ కుమార్​ తెలిపారు. ఆల్​ఇండియా కౌన్సిల్​ ఫర్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ ఆధ్వర్యంలో నవంబర్​ 21 నుంచి 26 వరకు ఉత్తర్​ ప్రదేశ్​లోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో ఈ అంతర్జాతీయ హ్యాకథాన్​ ఉంటుందని చెప్పారు. ఈ ముగ్గురు విద్యార్థులు పాల్గొని విద్య, పునరుత్పాదక శక్తి, తాగునీరు, పారిశుధ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాల్లో ఒక దానిపై హ్యాకథాన్​కు సమాధానాలు ఇస్తారని డైరెక్టర్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెంటర్​ సృజన, రాకేష్​ రెడ్డి, నరేంధర్​ తదితరులున్నారు.

జాబ్ మేళాతో  గిరిజన యువతకు ఉద్యోగాలు
ఇచ్చోడ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించినట్టు ఐటీడీఏ పీఓ కె. వరుణ్ రెడ్డి  తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక కేబీ కాంప్లెక్స్ లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ హైదరాబాదులోని ప్రముఖ రిలయన్స్, కే. ఎఫ్ సీ, అపోలో ఫార్మసీ, క్రీమ్ స్టోన్, హెటిరో ఫార్మసీ, ఏపీ బయో ఫెర్టిలైజర్స్, శుభ గృహ రియల్ ఎస్టేట్, బిగ్ సి వంటి 13 రకాల ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 268 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. అనంతరం యువతకు ఉద్యోగ నియామకపు పత్రాలను పీఓ అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ కనక భీమ్రావ్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కీ రావు, ఓఎస్డీ కృష్ణయ్య, బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ పాల్గొన్నారు.