మెదక్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్‌‌ రాహుల్ రాజ్

మెదక్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్‌‌ రాహుల్ రాజ్

మెదక్/పాపన్నపేట, వెలుగు: మెదక్ ను డ్రగ్స్  రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌‌ రాహుల్ రాజ్ కోరారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్‌‌ కమిటీ సమన్వయ సమావేశాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించారు. గంజాయి సాగు చేస్తూ పట్టుబడి, కేసులు నమోదైతే వారికి ప్రభుత్వ పథకాలు రద్దవుతాయన్నారు. మనోహరాబాద్, తూప్రాన్ ఏరియాల్లోని పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల వారు పని చేస్తున్నారని, అలాంటి చోట్ల డ్రగ్స్ వినియోగం ఉండే అవకాశం ఉందని చెప్పారు. 

చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి, డ్రగ్స్ రవాణాను అడ్డుకోవాలన్నారు. వానాకాలం సాగుకు యోగ్యం కాని ప్రదేశాల్లో గంజాయి పండించే అవకాశం ఉందని, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, నివేదిక ఇవ్వాలని సూచించారు. సెలవు రోజుల్లో చికెన్ సెంటర్లు, పాఠశాలలు, హాస్టల్ బిల్డింగ్స్ పై నిఘా ఉంచాలని చెప్పారు. తండాలు, రిమోట్ ఏరియాల్లో జాయింట్ ఇన్​స్పెక్షన్ నిర్వహించాలన్నారు.  

కొత్త రేషన్ కార్డులు పంపిణీ.. 

పాపన్నపేట్ మండలం చిత్రియాల్ గ్రామంలో బుధవారం కలెక్టర్ రాహుల్ రాజ్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మండలంలో 479 రేషన్ కార్డులు మంజూరవగా 2,342 మంది పేర్లు యాడ్​చేసినట్లు పేర్కొన్నారు. హవేలీ ఘనపూర్ మండలంలోని కుచన్ పల్లిలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని  పరిశీలించారు. పశు వైద్యశాలను తనిఖీ చేసారు. మండలంలో అర్హత కలిగిన 650 మందికి రేషన్ కార్డులు మంజూరు చేయగా 1,917 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.