రోగులకు మెరుగైన సేవలు అందించాలి : రాజీవ్ గాంధీ హనుమంతు

రోగులకు మెరుగైన సేవలు అందించాలి : రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్​లో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్​ గాంధీ హన్మంతు సూచించారు. బుధవారం నగరంలోని జీజీహెచ్​ హాస్పిటల్​ను ఆయన విజిట్ చేసి, జిల్లాలోని ప్రధాన హాస్పిటళ్ల పనితీరును రివ్యూ చేశారు. వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది కొరత గురించి ఆరా తీశారు. రోగులు, వారి సహాయకులకు కావాల్సిన సౌలత్​లు ఎలా ఉన్నాయో తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ ​డాక్టర్ ​ప్రతిమారాజ్​పవర్​ పాయింట్ ప్రజెంటేషన్​ ద్వారా జీజీహెచ్​ పనితీరును వివరించారు.

ప్రతి రోజు గరిష్ఠంగా 2 వేల మంది ఔట్​ పేషెంట్లు, 300 దాకా ఇన్​పేషెంట్లు ఆస్పత్రికి వస్తున్నారని తెలిపారు. 2023లో 83 కీలు మార్పిడి ఆపరేషన్​లు చేశామని, సిజేరియన్​ కాన్పులను 75 శాతం నుంచి 35 శాతానికి తగ్గించామని పేర్కొన్నారు. అదనంగా ఐదు ఎక్స్​రే యూనిట్లకు తోడు ఒక ఎంఆర్ఐ యూనిట్​ఏర్పాటు చేస్తే సేవలు మరింత మెరుగుపర్చే వీలుందన్నారు.  మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డాక్టర్​ ఇందిరా, జిల్లాలోని గవర్నమెంట్​ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలి

ఆర్మూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు, వసతులు కల్పించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండలం ఫతేపూర్​లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి​ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?  అని ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చేయాలన్నారు.

రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీల్లో నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని, ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన కేంద్రాల్లోని హమాలీల సేవలను ఇతర చోట్ల వినియోగించుకోవాలని సూచించారు. ఎంట్రీలను ఎప్పటికప్పుడు పూర్తి చేసి సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్మూర్ ఆర్డీవో  రాజాగౌడ్, డీఎస్ఓ చంద్రప్రకాశ్, సివిల్ సప్లై డీఎం జగదీశ్, డీసీఓ శ్రీనివాస్ ఉన్నారు.