గద్వాల, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అద్దెకిస్తే కేటాయింపులు రద్దు చేస్తామని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గురువారం వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అద్దెకు ఇచ్చినా, లేదా విక్రయించినా వారి కేటాయింపులను వెంటనే రద్దు చేస్తామన్నారు.
ఆ తర్వాత రూ. 5.7 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని, రూ. 12 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ పనులను తనిఖీ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి 2026-–27 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని, శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు గోన్ పాడులోని కస్తూరిబా విశ్వవిద్యాలయ భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
