ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న తహసీల్దార్లను కలెక్టర్ ఎస్.వెంకట్ రావు అభినందించారు. గురువారం ఆయన ధరణి, పోడు భూములు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు తదితర అంశాలపై తహసీల్దార్లు, ఆఫీసర్లతో సమీక్షించారు. ‘ధరణి’ సమస్యలను ఎప్పటికప్పుడూ క్లియర్​చేస్తూ  జిల్లాను రాష్ర్టంలోనే  ఫస్ట్​ప్లేస్​లో నిలపాలన్నారు. తహసీల్దార్లు సుమోటోగా తీసుకుని సమస్యలను పరిష్కరించాలన్నారు. పోడు భూముల పరిశీలన, అంగన్​వాడీ  సెంటర్లను  అధికారులు తరచుగా తనిఖీ చేయాలని  ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, జిల్లా సంక్షేమశాఖ ఆఫీసర్ జరీనా బేగం తదితరులు పాల్గొన్నారు. 

సైబర్​ నేరగాళ్లతో జాగ్రత్త:అడిషనల్ ఎస్పీ రామేశ్వర్  
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అ సైబర్​ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద  వ్యక్తులకు ఓటీపీ నంబర్​ చెప్పొద్దని అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ సూచించారు. గురువారం నాగర్ కర్నూల్ ఎస్పీ మీటింగ్ హాల్​లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రజలను భయపెడుతున్న సైబర్ ​క్రైమ్స్​పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.  సైబర్​ నేరగాళ్లు ఎక్కువగా సోషల్ మీడియా ట్విటర్, పేస్ బుక్, స్నాప్ షార్ట్, వాట్సాప్ లలో మనకు తెలియకుండానే ఫోన్ హ్యాకింగ్ చేసి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వేధిస్తారని, అలాంటి సమస్య వస్తే వెంటనే 1930,112,100 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫొటోలను సోషల్​మీడియాలో షేర్ చేయవద్దని, ఆడపిల్లలకు బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్​చేయాలన్నారు. తెలిసిన వారే అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని, మొబైల్​వాడేటప్పుడు అలర్ట్​గా ఉండాలని సూచించారు. పలు కాలేజీల ప్రిన్సిపాల్స్​శ్రీనివాస్, కోదండరాములు, శ్రీనివాసులు, రాజు, అంజయ్య, అర్జునయ్య, షీ టీం  ఇన్​చార్జి విజయలక్ష్మి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.  


స్కూళ్లలో పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి:కలెక్టర్ వల్లూరు క్రాంతి 
గద్వాల, వెలుగు:  ‘మన ఊరు– మన బడి’, పల్లె దవాఖాన పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని  కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో  పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్​అధికారులతో కలెక్టర్​సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  రివాల్వింగ్ ఫండ్ అడ్వాన్స్ తీసుకొని పనులను పూర్తి చేసి రికార్డు చేస్తే  వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. స్కూళ్లలో  అన్ని అభివృద్ధి పనులను  వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.  పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు  రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.  అనంతరం డీడబ్ల్యూ, ఎండీసీ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్​ఈఈ సమత, శ్రీనివాసులు,  డీఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

 పనులను స్పీడప్​ చేయాలి కలెక్టర్ శ్రీహర్ష 
కోస్గి టౌన్ , వెలుగు : ‘మన ఊరు –మన బడి’ పనులు స్పీడప్​చేయాలని  కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.  గురువారం ఉదయం  గుడుమాల్, బలభద్రాయ పల్లి, మీర్జా పూర్, బిజ్వరం , చెన్నారం, ముస్రిఫా, కోస్గి , నాచారం , బోగరం గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు.  ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని ఎంస్ఎంసీ సభ్యులు, సర్పంచ్​లను ఆదేశించారు. అనంతరం జడ్పీ హైస్కూల్​ను విజిట్​చేసి .. స్టూడెంట్లకు పాఠాలు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమాన్ని బాధ్యత యుతంగా నిర్వహించాలని ఆదేశించారు.  విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్​శ్రీనివాస్, ఆర్​అండ్​డీఈ రాములు, ఎంపీడీవో వెంకటయ్య  పాల్గొన్నారు. 

కష్టపడితే విజయం మనదే:బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి
అలంపూర్, వెలుగు: కార్యకర్తలు కష్టపడితే విజయం మనదే అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి అన్నారు. గురువారం అలంపూర్ పట్టణంలోని హరిత హోటల్ లో బీజేపీ నాయకుల తో సమావేశం నిర్వహించారు. హాజరైన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బీజేపీ బలపడడానికి  కార్యకర్తలు కృషి చేయాలన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతోందని, జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కష్టపడాలన్నారు.   బూత్​లెవల్​లో కార్యకర్తలు మోడీ సంక్షేమ పథకాలను  విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసాద్ స్కీమ్ లో భాగంగా జోగులాంబ ఆలయానికి రూ.37 కోట్ల  ఫండ్స్​విడుదల చేశారని, వాటి పనులను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.  అలంపూర్ అసెంబ్లీ  ఇన్​చార్జి వెంకట్ రెడ్డి, తాలూకా కన్వీనర్ తిరుమల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంల ధర్నా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఎన్ఎంలు డీఎంహెచ్​వో ఆఫీస్​ఎదుట ధర్నా చేశారు.  ఈ సందర్భంగా మెడికల్​ఎంప్లాయీస్​యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.. 2016 లో ఏఎన్ఎంలు 47 రోజులు సమ్మె చేస్తే  సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ పరిష్కరించలేదని విమర్శించారు. కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్​చేసి ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్​వో డాక్టర్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రకాంత్, మెడికల్ ఎంప్లాయీస్​యూనియన్ రాష్ర్ట నాయకుడు విజయవర్ధన్ రాజు తదితరులు  పాల్గొన్నారు. 


బీజేపీని బలోపేతం చేయాలి:బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్​రెడ్డి
పెబ్బేరు, వెలుగు : బీజేపీని బూత్ లెవల్​ నుంచి  బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని  పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్​రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పెబ్బేరు పట్టణంలోని వల్లపు రెడ్డి ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన శ్రీరంగాపూర్, పెబ్బేరు టౌన్, మండలాల కోర్ కమిటీ  మీటింగ్​లకు హాజరై మాట్లాడారు. టీచర్​ఎమ్మెల్సీ  ఎలక్షన్​నేపథ్యంలో జిల్లాలోని 14 మండలాలు, 5 మున్సిపాలిటీలను 3 జోన్లుగా విభజించామన్నారు.  ఇప్పటి వరకు13 మండలాల మీటింగ్స్​జరిగాయని, ఈ నెల 27 వరకు పూర్తి స్థాయి కమిటీలను నియమించాలని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీ ల పర్యవేక్షణ, నూతన బూత్ కమిటీల ఏర్పాటుపై కోర్ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్​.వెంకట్​రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, బుడ్డన్న, హేమారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సహదేవుడు  పాల్గొన్నారు.

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి:అడిషనల్ కలెక్టర్ మోతిలాల్
 నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  2023 జనవరి ఒకటో తేదీకి 18 ఏండ్లు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అడిషనల్​కలెక్టర్ మోతిలాల్ కోరారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో  ‘స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023’ ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ పై నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు అర్థం రవి, హుస్సేన్,  రామకృష్ణ, గోపాల్ పాల్గొన్నారు. 

ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు:ఎస్పీ అపూర్వరావు
వనపర్తి టౌన్, వెలుగు: ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ సందర్భంగా జిల్లాలో  ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నామని వనపర్తి ఎస్పీ కె. అపూర్వరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 వరకు జిల్లాలో సామాజిక సేవ, పోలీసు డ్యూటీ గురించి అవగాహన కార్యక్రమాలతో పాటు ఫొటో గ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసు విధులకు సంబంధించిన వివిధ రకాల సేవలపై 3 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్, జిల్లా పోలీసులు చేసిన, చేస్తున్న సామాజిక, మానవీయ సేవలకు సంబంధించిన ఫొటోలు, పోలీస్ ఇమేజ్ చాటే సహజమైన ఫొటోలతో ఈ పోటీల్లో పాల్గొనాలని ఎస్పీ సూచించారు. షార్ట్​ఫిల్మ్ తీసినవారు పెన్ డ్రైవ్ ద్వారా, ఫొటోగ్రఫీ తో పోటీల్లో పాల్గొనేవారు 10X8 సైజ్​లో 3 ఫొటో లను  ఈ నెల 23  లోగా, పూర్తి వివరాలతో ఎస్పీ ఆఫీస్​లోని పీఆర్వోకు  అందజేయాలని ఎస్పీ సూచించారు.  


ఖర్గే గొప్ప ప్రజాస్వామిక వాది :టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అంబేద్కర్ బాటలో నడుస్తున్న గొప్ప ప్రజాస్వామిక వాది మల్లికార్జున ఖర్గే అని టీపీసీసీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ ముదిరాజ్ ఇంటి వద్ద ఆయన కాంగ్రెస్​సీనియర్​నేత కత్తి వెంకటస్వామి గౌడ్​తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్​అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే బ్లాక్ కాంగ్రెస్​అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 9 సార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక శాసన సభాపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు నిర్వహించారన్నారు. అత్యంత రాజకీయ అనుభవం ఉన్న ఖర్గే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారన్నారు. రాహుల్​గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజకీయాలకతీతమని, ఈ యాత్ర  సమైక్యతా లక్ష్యంతో సాగుతోందన్నారు. జోడో యాత్రలో రాజకీయపరమైన చేరికలు ఉండవని మల్లు రవి స్పష్టం చేశారు.  జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలో అడుగుపెడుతుందని, అదే రోజు మధ్యాహ్నం మక్తల్ చేరుకున్నాక, దీపావళి సందర్భంగా యాత్రకు 3 రోజులు విరామాన్ని ప్రకటిస్తారన్నారు. 27 నుంచి తిరిగి  కొనసాగుతుందన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ ఉబేదుల్లా కొత్వాల్​, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముత్యాల ప్రకాశ్, సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.