కాళేశ్వరం మూసీ ద్వారా చెరువులు నింపండి: కలెక్టర్ ఎస్‌ వెంకట్‌రావు 

కాళేశ్వరం మూసీ ద్వారా చెరువులు నింపండి: కలెక్టర్ ఎస్‌ వెంకట్‌రావు 

సూర్యాపేట, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం, మూసి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపాలని  కలెక్టర్ ఎస్‌ వెంకట్‌రావు ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.  జిల్లాలో ఈ సారి లక్ష ఎకరాల్లో మెట్ట పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు  రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మేలైన వంగడాలతో పాటు సస్యరక్షణ చర్యలపై సూచనలివ్వాలని ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టుల నీటి లభ్యత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ శివధర్మ తేజ, ఈ‌ఈ భద్రు నాయక్, విజయ్ కుమార్, డీఆర్వో రాజేంద్రకుమార్,  తహసీల్దార్‌‌ వెంకన్న  పాల్గొన్నారు

పట్టణాన్ని సుందరవనంలా తీర్చిదిద్దాలి 

సూర్యాపేట పట్టణాన్ని సుందరవనంలా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎస్‌. వెంకట్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 24న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో టేకుమట్ల నుంచి దూరజ్ పల్లి వరకు నేషనల్ హైవే 365కు ఇరుపక్కల నాటిన మొక్కలను మంగళవారం  డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డీఎఫ్‌వో సతీష్ కుమార్‌‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కల్లో ఎదుగుదల లేనిచోట కొత్త మొక్కలు నాటాలని  సూచించారు. జనగాం క్రాస్ రోడ్డు జంక్షన్ వద్ద పూల మొక్కలను నాటి సుందరికరణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పరిశీలించారు. వారంలోగా మొక్కలు నాటడంతో పాటు మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, హార్టికల్చర్ అధికారి శ్రీధర్, డిప్యూటీ డీఆర్డీవో పెంటయ్య అధికారులు, సిబ్బంది ఉన్నారు.