పిల్లలంటే అంత అలుసా.. కలెక్టర్ సత్యశారద బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి పై ఫైర్

పిల్లలంటే అంత అలుసా.. కలెక్టర్ సత్యశారద బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి పై ఫైర్

నల్లబెల్లి, వెలుగు: పిల్లలంటే అంత అలుసా? హాస్టల్​ను తనిఖీ చేయకపోవడమేంటని వరంగల్​ కలెక్టర్​ సత్యశారద బీసీ వెల్ఫేర్​ జిల్లా అధికారి పై ఫైర్​ అయ్యారు. సోమవారం కలెక్టర్​ నల్లబెల్లి బీసీ హాస్టల్​ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్​ పరిసరాలను పరిశీలించి, బిల్డింగ్​ పనులు ఎందుకు ఆలస్యమయ్యాయని, ఓవైపు పాత బిల్డింగ్​ శిథిలావస్థలో ఉండి పెచ్చలూడిపోతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు.

 జిల్లా బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ పుష్పలతకు ఫోన్​ చేసి ఈ రోజు కలెక్టర్​ విజిట్​ ఉందని తెలుసా అంటూ ప్రశ్నించగా, పొంతలేని సమాధానం చెప్పడంతో సరెండర్​ చేసేందుకు ఫైల్​ రెడీ చేయండంటూ అధికారులకు ఆదేశించారు. తాత్కాలికంగా సమీపంలోని ఎస్సీ హాస్టల్​కు షిప్ట్​ చేయాలని, కొత్త బిల్డింగ్​ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం నల్లబెల్లి మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

కాలేజీ అవసరాలపై ప్రతిపాదనలు రెడీ చేయాలి

నర్సంపేట: నర్సంపేట మెడికల్​ కళాశాలలో వసతులు, సిబ్బంది నియామకం ఇతర అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సంపేట మెడికల్ కాలేజీలో  కళాశాల పర్యవేక్షకులు, ఫ్యాకల్టీలతో కలెక్టర్ సమావేశమై కళాశాల సమర్థవంతంగా నిర్వహించేందుకు కావలసిన సిబ్బంది నియామకం, ఇతర అవసరాల గురించి చర్చించారు. వెంటనే ప్రభుత్వానికి మంజూరు నిమిత్తం ప్రతిపాదనలు పంపేందుకు రెడీ చేయాలని సూచించారు.