
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వీహబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ స్కీమ్) ప్రోగ్రాం పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వరల్డ్ బ్యాంక్, మినిస్ట్రీ ఆఫ్ ఎం ఎస్ ఎంఈ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రోగ్రాం మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలకు బిజినెస్ సపోర్ట్ అందనుందన్నారు. రెండేళ్ల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు తమ బిజినెస్ అభివృద్ధి చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్ తెలిపారు.
టెక్స్ టైల్ , ఫుడ్ మాన్యుఫాక్చరింగ్, హస్తకళలు వంటి రంగాల్లోని బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ డైవర్సిఫికేషన్, బ్రాండింగ్, మార్కెటింగ్ అందనుందని వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ తెలిపారు. ప్రోగ్రాం పైన అవగాహన కల్పించి మహిళల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీఆర్డీడీఓ మొగులప్ప, వీహబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సాయిరాం పాల్గొన్నారు.
కేజీబీవీని సందర్శించిన కలెక్టర్
ధన్వాడ, వెలుగు : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు, స్టాపు, పాఠశాల వివరాలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి రిజిస్టర్లను తీసుకుని జిల్లా కార్యాలయానికి రావాలని ఎస్వో గంగమ్మను ఆదేశించారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించేట్లు చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోజు రోగులు ఎంత మంది వస్తున్నారని వైద్య సిబ్బందిని ఆరాతీశారు. ఆస్పత్రి ఆవరణలో వనమహోత్సవం చేపట్టాలని ఎంపీడీవోకు సూచించారు. డీఈవో గోవిందరాజు, ఎమ్మార్వో సిందూజ, తదితరులు ఉన్నారు.