
మహబూబ్‌నగర్ (నారాయణపేట), వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి, అమ్మిరెడ్డి పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. అప్పక్‌పల్లి గ్రామానికి మంజూరైన 50 ఇండ్లలో 16 ఇండ్ల నిర్మాణాలు రూఫ్, స్లాబ్, లెంటల్ స్థాయిలో ఉన్నాయన్నారు. మిగతా 34 మంది లబ్ధిదారులు ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదని హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ కలెక్టర్‌కు వివరించారు.
అమ్మిరెడ్డి పల్లి గ్రామానికి మంజూరైన 15 ఇండ్లు బేస్‌మెంట్ లెవల్‌లో కొనసాగుతున్నాయన్నారు. అప్పక్‌పల్లిలో పూర్తి చేసిన ఒక ఇల్లు ప్రారంభానికి సిద్ధంగా ఉండడంతో కలెక్టర్ అభినందించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నారాయణపేట మండలం పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.