బోధన్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించగానే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని పెగడపల్లి, సాలురా మండలం సాలంపాడ్ క్యాంప్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారని నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు.
ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ రైతులను అడిగారు. కౌలు రైతుల ధాన్యం సేకరణలో జాప్యం చేస్తున్నారని తెలుపగా, సెంటర్ల నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేశారు. ధాన్యం రాగానే వెంటనే కాంటా పెట్టాలని జాప్యం చేయొద్దన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు సెంటర్లను పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
రైతుల వివరాలు నమోదు చేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో కౌలు రైతుల పేర్లు లేని పక్షంలో వారు వరి సాగు చేశారా లేదా అన్నది వ్యవసాయ అధికారులు ధ్రువీకరించాలన్నారు. రైతుల వివరాల్లో పొరపాట్లు ఉంటే సరిచేయాలని ఆదేశించారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం వేయించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని, సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ ను ఆదేశించారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలనైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. గత సీజన్ లో 600 కేంద్రాలు ఉండగా, ఈసారి 670 కేంద్రాలు నెలకొల్పుతున్నామని, అవసరమైన చోట అదనంగా కూడా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, తహసీల్దార్ విఠల్, ఏవో సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు.
