సూర్యాపేట, వెలుగు: అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం- 2025 వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం మహిళా,శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించి సీనియర్ సిటిజన్స్ తో ఆయన సమావేశం నిర్వహించారు.
నవంబర్ 19 వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయిలో సర్పంచ్ ఇతర ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
నవంబర్ 1, 2025 నుంచి 31 జనవరి 2026 వరకు బాల్య వివాహల నిర్మూలన కోసం 100 రోజుల ప్రచారోద్యమం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. బాల్య వివాహాలు గురించి సమాచారం తెలిస్తే చైల్డ్ లైన్ 1098 కు తెలియజేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహ రావు, వయో వృద్ధుల కమిటీ మెంబెర్స్ సిబ్బంది పాల్గొనారు.
నల్గొండ అర్బన్, వెలుగు : వయో వృద్ధుల పట్ల ప్రేమ, ఆప్యాయంగా మెలగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వయో వృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి 19 వరకు వృద్ధాశ్రమాల్లో ఆటల పోటీలు, వినోద కార్యక్రమాలు, వయో వృద్ధుల కోసం ఆరోగ్య పరీక్షలు, సీనియర్ సిటిజన్ హక్కుల పైన మారథాన్ వాక్కు, డివిజన్ స్థాయిలో సీనియర్ సిటిజన్ చట్టం 2007 పైన అవగాహన కార్యక్రమాలు, జిల్లా స్థాయిలో వయో వృద్ధుల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
