భవిష్యత్ దారి దీపాలు గ్రంథాలయాలు : తేజస్ నంద్ లాల్ పవార్

భవిష్యత్ దారి దీపాలు గ్రంథాలయాలు : తేజస్ నంద్ లాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: లైబ్రరీలు జీవితాలకు,  భవిష్యత్తుకు దారిని చూపిస్తాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని గ్రంథాలయ కేంద్రంలో నిర్వహించిన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ప్రతి రోజు 5  పేజీలు చదివడం అలవాటుగా మార్చుకోవాలని కోరారు. అధునాతన సౌకర్యాలతో నూతన భవనం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల్లో  భాగంగా నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాసం పోటీ, చిత్ర లేఖనం పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. 

కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, గ్రంధాలయ చైర్మన్ వంగవేటి రామారావు, కార్యదర్శి బాలమ్మ పాల్గొన్నారు.  మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి లైబ్రరీకి రూ.లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. లైబ్రేరియన్ శ్యామ్ సుందర్ రెడ్డి, రంగారావు, విజయభాస్కర్, సృజన, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, గడ్డం వెంకన్న, రుద్రంగి రవి, నరేష్ పిళ్లై,  తదితరులు హాజరైనారు.

జడ్పీ హైస్కూల్‌ ఆకస్మిక తనిఖీ 

తుంగతుర్తి, వెలుగు :  సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని జడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ తేజస్ నంద్ లాల్  సందర్శించి, పదో తరగతి విద్యార్థులకు  తెలుగు, ఇంగ్లీష్, గణితంపై  స్వయంగా ప్రశ్నలు అడిగి పరిశీలించారు.  విద్యార్థులు సందేహాలను భయపడకుండా ఉపాధ్యాయులను అడిగి క్లియర్ చేసుకోవాలని సూచిస్తూ,  బ్లాక్‌బోర్డుపై లెక్కలు రాయించి వారి ప్రతిభను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ హరికిషోర్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.