ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం : కలెక్టర్లు వి.పి.గౌతమ్

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం : కలెక్టర్లు వి.పి.గౌతమ్

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల ఓటింగ్ సీసీ కెమెరాల లైవ్ పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగేలా చూస్తామని, దొంగ ఓట్లు ఉన్నాయని అపోహలు వద్దని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్లు వి.పి.గౌతమ్, ప్రియాంక అలా చెప్పారు.  శనివారం ఖమ్మంలోని ఐడీవోసీలోని న్యూ కలెక్టరేట్ బిల్డింగ్ మీటింగ్​హాల్ లో ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు తుశార్ కాంతా మహంతి, సతేంద్ర సింగ్, సాయి కునాల్ కుమార్, రాజీవ్ కుమార్ సింగ్ తో కలిసి గౌతమ్ మాట్లాడారు.

 దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ చెప్పారు. ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో బీఎల్ఓ, ఇతర అధికారులతో విచారణ జరిపినట్లు తెలిపారు. టేకులపల్లి, వైఎస్సార్ నగర్ లో ఉన్న ఓటర్లు ఇంటి నంబర్ లేకుండా ఓటుకు అప్లై చేసుకున్నట్లు తెలిపారు. ఓటుకు అప్లై చేసుకోవడానికి ఇంటి నంబర్, బిల్డింగ్ లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్లాట్ ఫామ్ పై జీవించే పౌరులు కూడా ఓటు అప్లై చేసుకోవచ్చని సూచించారు.

దొంగ ఓట్లు ఉన్నాయని అపోహ చెందొద్దని సూచించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటికి 12,16,796 ఓట్లు ఫైనల్ అయినట్లు చెప్పారు. వీటిలో పురుషుల ఓట్లు 5,89,165, స్త్రీలు ఓట్లు 6,89,165 ఉన్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు పొందే యువకులు 49,396 మంది ఉండగా, మిగతా ఓట్లు వివిధ కేటగిరీలకు చెందినవి ఉన్నాయని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే 13 రకాల సర్వీస్ చేసే వారి నుంచి పోస్టల్ బ్యాలెట్ 3186 వచ్చాయని తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అప్లై చేసుకున్న వారి ఇండ్లకు వెళ్లి ఈనెల 28,29 లలో ఎన్నికల  నిబంధనల మేరకు ఓటు వేయించి, సీల్ చేయనున్నట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ నమోదులో మూడు సార్లు ఓటర్లు ఇంటికి వెళ్లి డోర్ లాక్ చేసి ఉంటే, వారి ఓటు ను తొలగిస్తామన్నారు. 1295 పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్లాన్​ చేసినట్లు తెలిపారు.26 వేల డూప్లికేట్ ఓట్లను తొలగించామన్నారు.  16 నుంచి ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులను వారి అడ్రస్ కు పోస్టల్ ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు. 

నగదు, మద్యం పట్టివేత

ఇప్పటి వరకు చెక్ పోస్టుల్లో ఎలాంటి పత్రాలు చూపకుండా రూ.5,01,58,457 నగదు పట్టుబడినట్లు కలెక్టర్​ గౌతమ్​ తెలిపారు. రూ.35,313.3 విలువైన లిక్కర్ పట్టుబడినట్లు చెప్పారు. అక్రమ రవాణాలో 437.035 గంజాయి పోలీస్ లు పట్టుకున్నట్లు తెలిపారు. 9570 వాల్ క్లాక్స్, మొబైల్స్, క్రాకర్స్ ఇతరేతర వస్తువులు పట్టుబడ్డట్లు వివరించారు.  

215 నామినేషన్లు.. 

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలు కలిపి 215 నామినేషన్లు దాఖలయ్యాని కలెక్టర్​ గౌతమ్​ చెప్పారు. వీటిలో గుర్తింపు పార్టీల నుంచి 32, రికగ్నైజ్డ్ పార్టీ ల నుంచి 48, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 67 నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్​ 31వ తేదీ వరకు నమోదైన కొత్త ఓటర్లతో కలిపి తుది జాబితాను రిలీజ్​ చేశామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల తెలిపారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 1095పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 9,66,439 మంది ఓటర్లున్నారని తెలిపారు. 4,71,745 మంది పురుషులు, 4,94,650 మంది మహిళా ఓటర్లు, 44 మంది ఇతరులు ఉన్నారని వివరించారు.

పినపాక నియోజకవర్గంలో 1,98,402 మంది ఓటర్లు, ఇల్లెందు నియోజకవర్గంలో 2,19,569 మంది ఓటర్లు, కొత్తగూడెం నియోజకవర్గంలో 2,43,846 మంది ఓటర్లు, అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,55,961 మంది ఓటర్లు, భద్రాచలం నియోజకవర్గంలో 1,48,661 మంది ఓటర్లున్నారని చెప్పారు.  జిల్లాలోని నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారని కలెక్టర్​ ప్రియంక అల శనివారం ఒక ప్రకటనలో  తెలిపారు.