పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ..అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

పంచాయతీ ఎన్నికలు  ప్రశాంతంగా నిర్వహించేలా ..అధికారులు సమన్వయంతో పనిచేయాలి  : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు : పంచాయతీ ఎన్నికలు  ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. గురువారం కలెక్టరేట్ లో స్థానిక ఎన్నికల నిర్వహణపై మండల ప్రత్యేకాధికారులు, జోనల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలకు 3 విడతల్లో 87 జోన్ లుగా ఏర్పాటు చేశామన్నారు. 

జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి రూట్ మ్యాప్, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, నెట్ వర్క్ పై నివేదికలను ఈనెల 5లోపు సమర్పించాలని ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 10న ఉదయం 9 గంటలకు ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు.

 ఫలితాలు వెలువరించి ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించి తిరిగి సిబ్బందిని స్వీకరణ కేంద్రాలకు తీసుకొచ్చేవరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్రీనివాస్, అడిషనల్  కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీపీవో  భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.