ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి :  కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  •    ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు

ఆసిఫాబాద్/నస్పూర్/ఆదిలాబాద్​టౌన్/నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్​తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వర్షాలకు ఇల్లు కూలిపోయిందని, పంటలు నష్టపోయామని పరిహారం ఇప్పించాలని, భూమికి పట్టా ఇవ్వాలని, బాబాపూర్ లోని మైనారిటీ బాలికల గురుకులంలో సీటు ఇప్పించాలని, పాసుపుస్తకంలో పేరు సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. 

మంచిర్యాల కలెక్టరేట్​లో కలెక్టర్ కుమార్ దీపక్ దరఖాస్తులు స్వీకరించారు. తమ భూమిని కొంతమంది ఆక్రమించు కొని బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని, రెసిడెన్షియల్ లో సీటు ఇప్పించాలని, భూమికి పట్టా ఇప్పించాలని, రేషన్ డీలర్లకు రావాల్సిన 5 నెలల కమిషన్ విడుదల చేయాలని, శంకర్​పల్లి నుంచి సండ్రోన్​పల్లికి వెళ్లే రహదారి రిపేర్లు చేపట్టి పాలవాగుపై వంతెన నిర్మించాలని అర్జీదారులు దరఖాస్తులు అందజేశారు. 

సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి కోరారు. జన్నారం మండల కేంద్రలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నీరటి రామ్ ప్రసాద్ దరఖాస్తు అందజేశారు.

ఆదిలాబాద్​ జిల్లాలో 139 దరఖాస్తులు

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్​ కలెక్టర్ ​శ్యామలాదేవీ, ట్రైనీ కలెక్టర్ ​సలోనీ ఛబ్రా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 139 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వివిధ మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని నిర్మల్ ​కలెక్టర్ అధికారులకు సూచించారు. 

దరఖాస్తుల స్వీకరణ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. మట్టి గణపతులపై అందరికీ అవగాహన కల్పించాలని, మట్టి గణపతులని పూజించేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. మట్టి గణపతులపై అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి తదితరులు పాల్గొన్నారు.