ఆసిఫాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామగ్రిని పకడ్బందీగా పంపిణీ చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. వాంకిడిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నిర్వహించే ఎన్నికల కోసం సామగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల్లో వినియోగించే సామాగ్రిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో రద్దీ లేకుండా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది కోసం పంపిణీ కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

