
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి కిచెన్, మధ్యాహ్న భోజనం నాణ్యత, వంట సరుకులు, గాయగూరలు, క్లాస్‌రూమ్‌లు, రిజిస్టర్‌ను పరిశీలించారు. విద్యార్థులు గైర్హాజరు కావద్దన్నారు. దీర్ఘకాలంగా హాజరు కాని విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టెన్త్ స్టూడెంట్లను వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని సూచించారు.
ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ప్రజా రవాణాకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కసాబ్ వాడి వార్డులోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతలకు వెంటనే రిపేర్లు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలని, ప్రతిరోజు చెత్తను సేకరించాలని సూచించారు. అనంతరం గోడవెల్లి వద్ద పెద్దవాగులో వినాయక నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులున్నారు.