ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్​ డేవిడ్​తో కలిసి సీసీఐ మార్కెటింగ్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ, తూనికలు కొలతలు, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలు ప్రక్రియపై రివ్యూ నిర్వహించారు. కలె క్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏటాది 3.34  లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోందని, 38 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.  

కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పత్తిని అమ్మేందుకు రైతులు  కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని, ఈ యాప్ వినియోగం, స్లాట్ బుకింగ్​పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లు చేపడతామని, అంతలోపు జిన్నింగ్ మిల్లుల్లో రిపేర్లు చేసి సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నాణ్యమైన విద్యుత్ అందించాలని, మిల్లుల్లో అగ్ని ప్రమాదాలకు తావులేకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతులు దళారులకు అమ్మకుండా  సీసీఐ కేంద్రాల్లో విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు.

భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

కాగజ్ నగర్, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్​ఆదేశించారు. బుధవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ అఫీస్​లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై డివిజన్​లోని మండలాల తహసీల్దార్లతో రివ్యూ నిర్వహించారు. 

ఆయన మాట్లాడుతూ భూభారతి గ్రామసభల్లో అందిన ప్రతి దరఖాస్తును రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, విస్తీర్ణం, విరాసత్ పట్టా మార్పిడి, డిజిటల్ సంతకం ఇష్యూలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.