ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి :  కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

సిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్/నస్పూర్/ఉట్నూర్​, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని  ఆసిఫాబాద్ ​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబర్ సరిచేయాలని, వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్​ఇప్పించాలని, ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇప్పించాలని, ఆశ్రమంలో పొరుగు సేవ పద్ధతిలో ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తులు అందాయి.   

ఆదిలాబాద్​లో 105 దరఖాస్తులు

ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిశీలించి వాటిని పరిష్కరించాలని ఆదిలాబాద్​కలెక్టర్​రాజర్షి షా ఆదేశించారు. కలెక్టట్​లో జరిగిన ప్రజావాణిలో ఆయా మండలాల నుంచి 105 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు.  భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

చెరువు కట్ట రోడ్డును కొందరు ధ్వంసం చేశారు

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరిం చేలా చర్యలు తీసుకుంటామని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. కలెక్టరేట్​లో బెల్లంపల్లి అడిషనల్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. నస్పూర్ మండలం తీగల్​పహాడ్ కాలనీవాసులు తమ ప్రాంతంలో దాదాపు 200 ఇండ్లకు వారు రాకపోకలు చేసే చెరువు కట్ట రోడ్డును కొందరు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకొని రోడ్డును పునరుద్ధరించాలని కోరారు. తాగునీరు సరఫరా చేయాలని, లక్షెట్టిపేట గిరిజన ఆశ్రమ బాలికల స్కూల్​లో ఉపాధి కల్పించాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని కోరుతూ దరఖాస్తులు అందించారు.

ఉట్నూర్​లో ప్రజావాణి

ప్రజావాణిలో వచ్చిన ప్రజల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని, తమ గ్రామానికి సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జైనూర్ మండలం భూసిమెట్ట గ్రామస్తులు, సోలార్ పంప్ సెట్ ఇప్పించాలని, అంగన్వాడీ సెంటర్ మంజూరు కోరుతూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు.