ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్​లో ఎస్పీ నితికా పంత్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్ తో కలిసి అధికారులు, ఉద్యోగులతో ట్రాఫిక్ రూల్స్​పై రివ్యూ నిర్వహించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అధికారి, రహదారి నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. బైక్ ​నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. 

రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని సూచించారు. ఉద్యోగులు, అధికారులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి, పోస్టర్లు రిలీజ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

నిర్మల్, వెలుగు: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల కట్టడికి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. భద్రతా మాసోత్సవాల గోడప్రతులను గురువారం కలెక్టరేట్​లో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రోడ్డు భద్రత నియమాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగేలా రోజువారీగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  కార్యక్రమంలో ఆర్టీవో దుర్గాప్రసాద్, డీపీఆర్ వో విష్ణువర్ధన్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.