
కాగజ్ నగర్, వెలుగు: వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలో ఆయన సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి 30 పడకల హాస్పిటల్, పెట్రోల్ పంప్ ఏరియా స్కూల్ తో పాటు ఫెర్టిలైజర్ షాప్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ వసతి హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాల పరిసరాలు, తాగునీటి నల్లాలు, క్లాస్‌రూమ్‌లు క్లీన్‌గా ఉంచుకోవాలన్నారు. పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ చెన్నకేశవను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వార్డులు, అవుట్ పేషంట్ సేవలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలతో వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మార్కెట్ ఏరియాలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. స్టాకు నిల్వలు, ధరల పట్టికను షాపు ముందు కచ్చితంగా పెట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ మధుకర్, కాగజ్ నగర్ ఏడీఏ మనోహర్, ఎంపీడీవో కోట ప్రసాద్, ఏవో రామకృష్ణ, ఎంఈవో వాసాల ప్రభాకర్ తదితరులున్నారు.