
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ పట్టణంలో, వీరన్నపేట, గుర్రంగట్టు ప్రాంతాల్లో చిరుత పులి సంచారం నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా పెట్టినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మంగళవారం కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ జానకితో కలిసి చిరుత పులి సంచరించిన ప్రాంతాన్ని సందర్శించారు. కాలి నడకన గుట్ట మీదకు వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
అటవీ, పోలీస్, మున్సిపల్ శాఖల నుండి టీమ్ లు ఏర్పాటు చేసి నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు బోను అమర్చారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్లవద్దని, తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని ప్రజలకు సూచించారు. డీఎస్‌పీ వెంకటేశ్వర్లు, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి, వన్ టౌన్ సీఐ అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.