- టీచర్లపై పాలమూరు కలెక్టర్ ఆగ్రహం
గండీడ్, వెలుగు: పప్పు నీళ్లు పోస్తే విద్యార్థులు ఎలా తింటారని టీచర్లపై కలెక్టర్ విజయేందిర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని వెన్నచేడ్ హైస్కూల్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ స్కూల్, హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. హైస్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నీళ్ల పప్పు వడ్డించడం చూసి ఇది పప్పేనా? నీళ్లు పోస్తే పిల్లలు ఎలా తింటారంటూ టీచర్లు, వంట నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెల్త్ సెంటర్లో రికార్డులు సరిగా లేకపోవడంతో రోజు వచ్చే రోగుల వివరాలు నమోదు చేయకపోవడమేమిటని సిబ్బందిపై మండిపడ్డారు. అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం, గుడ్లు, రికార్డులు పరిశీలించారు. సూపర్వైజర్ అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేసినట్లు లేకపోవడంతో అంగన్వాడీ టీచర్ను ఈ విషయమై ప్రశ్నించారు. సెంటర్ విజిట్ కు రావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో సూపర్వైజర్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఎంపీవో నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి పులిందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
డాక్టర్లు సమయపాలన పాటించాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్: జిల్లాలో పని చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ విజయేందిరబోయి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై పీహెచ్ సీ, సబ్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రిజిస్టర్లను సక్రమంగా మెయింటెయిన్ చేయాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. ఫీవర్ సర్వేను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెల 1న గ్రామ హెల్త్, శానిటేషన్, న్యూట్రిషన్ దినాన్ని తప్పకుండా నిర్వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఎంహెచ్ వో పద్మ పాల్గొన్నారు.