రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో రోడ్ యాక్సిడెంట్ ఆవేర్నెస్ మంత్ ప్రోగ్రాంపై అధికారులతో  కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ యాక్సిడెంట్లను నియంత్రించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

రోడ్డు భద్రతా మాసోత్సవాలను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఉద్యమంగా నిర్వహించాలని సూచించారు. హెల్మెట్, సీట్‌‌‌‌ బెల్ట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. 

ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న  బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ రోడ్ మార్కింగ్, స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం నగరంలోని శిశుగృహ హాల్​లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.