నెట్వర్క్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు. సోమవారం ఆయా జిల్లాలోని కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ పెట్టకూడదని, సమస్య తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గ్రీవెన్స్ కు 59 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆసిఫాబాద్కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, డీఆర్వో లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే దరఖాస్తులు స్వీకరించారు.
వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు మంజూరు చేయాలని, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, భూ సమస్య పరిష్కరించాలని తదితర అంశాలపై అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంచిర్యాలలో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్ బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తన ఇంటి స్థలాన్ని వేరేవారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమస్య పరిష్కరించాలని, దివ్యాంగుడినైన తనకు 4 చక్రాల వాహనం మంజూరు చేయాలని, రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని తదితర అంశాలపై దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.