ఎమ్మెల్యేలు ఓకే చేసిన లిస్టులనే కలెక్టర్లు ఫైనల్ చేయాల్సిన పరిస్థితి

ఎమ్మెల్యేలు ఓకే చేసిన లిస్టులనే  కలెక్టర్లు ఫైనల్ చేయాల్సిన పరిస్థితి

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీములపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తున్నది. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ​ఫండ్.. ఇలా స్కీము ఏదైనా ఎమ్మెల్యేలు ఓకే చేసిన లిస్టులనే కలెక్టర్లు ఫైనల్​ చేయాల్సిన పరిస్థితి. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు వెరిఫై చేసి పంపిన లిస్టుల్లో అన్ని అర్హతలు ఉన్న పేదల పేర్లు పక్కకుపోయి, అనర్హుల పేర్లు చేరిపోతున్నాయి. లిస్టుల్లో టీఆర్​ఎస్​ లీడర్లు, కార్యకర్తలకే ఫస్ట్​ ప్రయారిటీ ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్కారు నుంచి వచ్చే చెక్కులు కూడా ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులకే చేరుతున్నాయి. అక్కడ వాటిని ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎమ్మెల్యేల సిఫార్సులతో సంబంధం లేకుండా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీల ద్వారానే దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

అప్పట్లో అట్ల.. ఇప్పుడు ఇట్ల.. 

వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం గతంలో మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుంటే తహసీల్దార్ ఆఫీసులకు చేరేవి. తర్వాత తహసీల్దార్లు స్వయంగా గానీ, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ల ద్వారాగానీ క్షేత్రస్థాయిలో వెరిఫై చేయించి అర్హులతో లిస్టులు తయారు చేసేవారు. కానీ, 2018లో టీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాసెస్ ను ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులు, ఖర్చు చేసే ఫండ్స్​కు సంబంధించి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఆయా స్కీములకు సంబంధించి ఎమ్మెల్యేలు ఫైనల్​ చేసిన లిస్టులనే ఓకే చేయాలని కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చింది. 

ఎమ్మెల్యేల చేతుల్లోనే దళితబంధు

దళితబంధు లబ్ధిదారులను ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తున్నారు. గ్రామాలవారీగా టీఆర్​ఎస్​ సర్పంచులు, తమ పార్టీ లీడర్లు సూచించిన పేర్లతో లిస్టులు తయారుచేసి జిల్లా ఇన్​చార్జి మంత్రులకు పంపుతున్నారు. అక్కడి నుంచి వచ్చిన జాబితాలను కలెక్టర్ చైర్​పర్సన్​గా ఉన్న కమిటీలు ఫైనల్ చేసి ఎస్సీ కార్పొరేషన్​కు అందజేస్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్​ బెడ్​రూం స్కీం లబ్ధిదారుల ఎంపికలో కూడా టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల మార్క్​ స్పష్టంగా కనిపిస్తున్నది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేరుగా ఎమ్మెల్యేలే దరఖాస్తులు స్వీకరించి సీఎంవోలో ఇస్తున్నారు. ఆర్థిక సాయం మంజూరైన ఆ చెక్కులు కూడా సంబంధిత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ లకే వస్తున్నాయి. తర్వాత లబ్ధిదారులను క్యాంపు ఆఫీసులకు పిలిపించి అందజేస్తున్నారు. 

గ్రీవెన్స్​కు పోయినా ఫలితం ఉంటలే.. 

తమ పేర్లను ఆఫీసర్లు ఓకే చేసినా ఎమ్మెల్యేలు తొలగిస్తుండడంతో నిరుపేద అర్హులు, ప్రతీ సోమవారం కలెక్టరేట్​లలో జరిగే గ్రీవెన్స్​కు క్యూ కడ్తున్నారు. ఆయా స్కీములకు తాము అన్ని విధాలా అర్హులమని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కానీ కలెక్టర్లు మాత్రం తమ చేతిలో ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమకు దళితబంధు ఇప్పించాలంటూ కొందరు వరంగల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా అప్లికేషన్లు స్వీకరించలేమంటూ కలెక్టర్‌‌‌‌ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని వరంగల్‌‌‌‌కు చెందిన జె.శ్రీనివాస్‌‌‌‌ సహా నలుగురు హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. గురువారం పిటిషనర్లు, సర్కారు వాదనలు విన్న హైకోర్టు, లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు 
ఎవరని ప్రశ్నించింది.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో గొడవ

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, ఎమ్మెల్యే రసమయిని నిలదీసిన పబ్లిక్​తిమ్మాపూర్, వెలుగు: ఇండ్లు లేని పేదలను వదిలేసి.. అనర్హులకు, టీఆర్​ఎస్ లీడర్లకు డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇచ్చారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో పలువురు పేదలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శుక్రవారం ప్రారంభించి, లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు నిలదీశారు. నిలువ నీడలేని వారిని వదిలేసి, ఇప్పటికే ఇండ్లు, భూములు ఉన్నవారికి, టీఆర్ఎస్ లీడర్లకు ఇండ్లు ఇచ్చారని మండిపడ్డారు. వినోద్ కుమార్  జోక్యం చేసుకొని, త్వరలోనే మరో వంద ఇండ్లు నిర్మించి, ఇండ్లు లేనివారికి అందజేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంకెన్ని రోజులు ఇలా చెప్పుకుంటూ మభ్యపెడ్తారని స్థానికులు ప్రశ్నించారు. చివరికి సమాధానం చెప్పకుండానే వినోద్, రసమయి అక్కడి నుంచి 
వెళ్లిపోయారు.