
నస్పూర్, ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు ప్రయార్టీ ఇవ్వాలని కలెక్టర్లు అన్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ పట్టణ కేంద్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. అర్జీదారుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
కాగా మంచిర్యాల పట్టణంలోని అయిదో వార్డు కుంట కాలనీవాసులు తమ కాలనీలో కోతుల బెడద అధికంగా ఉందని కంప్లైంట్ ఇచ్చారు. ఆదిలాబాద్ కలెక్టరేట్మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్రాజర్షిషా అన్నారు. అప్లికేషన్లను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి ప్రజావాణి దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్క రించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పెండింగ్ సమస్యల్ని సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.