- జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశం
లక్సెట్టిపేట/ఆసిఫాబాద్: వెలుగు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
గురువారం లక్సెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి, సూరారం గ్రామాలకు గుల్లకోట గ్రామపంచాయతీ.. పోతపల్లి, అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు పోతపల్లి గ్రామపంచాయతీ.. చందారం, హనుమంతుపల్లి, రంగపేట గ్రామాలకు చందారం గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్రామపంచాయతీలో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలన్నారు. నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలన్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
నామినేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించా లని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. వాంకిడి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాంకిడి, జంబుల్ధరి గ్రామపంచాయతీల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు.
నామినేషన్ పత్రాలను పరిశీలించి స్టేజ్ 1 రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. కేంద్రం వద్ద రద్దీ లేకుండా చూడాలని సూచించారు. పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియ నిర్వహించాలన్నారు.
