చోటు మారే మొక్క.. రంగు మార్చే నత్త

చోటు మారే మొక్క..  రంగు మార్చే నత్త

ఈ ఏడాది 71 కొత్త జీవులను కనుగొన్న సైంటిస్టులు

పరిస్థితికి తగ్గట్టు రంగు, రూపు మార్చుకునే నత్తలు, చూస్తే లోపల మొత్తం కనిపించేలా పారదర్శకంగా ఉండే సాలీడు, ఒక చోటు నుంచి మరో చోటుకు కదిలే మొక్క, రంగు రంగుల చేప, పిల్లి కళ్ల చేప.. ఒక్కటేమిటి ఈ ఏడాది 71 కొత్త జీవులను సైంటిస్టులు కనుగొన్నారు. ఐదు ఖండాలు, మూడు మహాసంద్రాల్లో అవి ఉన్నట్టు గుర్తించారు. ఆ జీవుల్లో 17 రకాల చేపలు, 15 బల్లి జాతి సరీసృపాలు, 8 పూల మొక్కలు, ఆరు సముద్రపు నత్తలు, ఐదు సాలీళ్లు, నాలుగు ఈల్స్​, మూడు చీమలు, మూడు నలికిలి పాములు (తొండ జాతికి చెందినది), మూడు స్కేట్​ ఫిష్​, రెండు తుమ్మెదలు, రెండు కోరల్స్​, రెండు బల్లులను కనిపెట్టారు.

టాంజానియా తీరంలోని సముద్రం 60 మీటర్ల లోతులో వంగపండు రంగులో పొలుసులుండే 6 సెంటీమీటర్ల పొడవైన చేపను సిడ్నీకి చెందిన నిపుణుడు కనిపెట్టారు. బ్లాక్​పాంథర్​, మార్వెలల్​ కామిక్స్​లోని ఊహాజనితమైన సిటీ వకాండా పేరునే దానికి పెట్టారు. కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ కు చెందిన సైంటిస్టులు డీప్​ డైవింగ్​లో భాగంగా కనిపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్​ టాక్సానమీ స్పెషలిస్ట్​ యి కై టీ సహకారంతో అది కొత్త చేపేనని నిర్ధారించారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్​ మహా సముద్రాల్లో కనిపెట్టిన కొత్త చేప జాతులకు, దీనికి ఏమైనా సంబంధముందేమో తెలుసుకునేందుకు మైక్రోస్కోపు కింద దాని పొలుసులను పరిశీలించారు. ఆ తర్వాతే అది కొత్త రకం చేప అని తేల్చారు. పసిఫిక్​ ట్వైలైట్​ జోన్​లో దానిని కనిపెట్టారు. ట్వైలైట్​ జోన్​ అంటే అప్పుడప్పుడు మాత్రమే సూర్యుడి వెలుతురు పడే చోటు. మామూలుగా 660 అడుగుల నుంచి 3,300 అడుగుల లోతులో ఉంటుంది ఈ ట్వైలైట్​జోన్​. అంటే పూర్తిగా చీకటి ప్రాంతం అని
అనుకోవచ్చు.

వేరే చోటుకు మారే మొక్క.. రంగులు మార్చే నత్త

మామూలుగా చెట్లు, మొక్కలు ఎటూ కదలవు. నాటిన లేదా పాతిన చోటే ఉండిపోతాయి. కానీ, తాజాగా సైంటిస్టులు అవసరానికి తగ్గట్టు వేరే చోటుకు మారే ఓ కొత్త మొక్కనూ కనుగొన్నారు. దానికి ట్రెంబ్లియా ఆల్టోపారైసెన్సిస్​ అని పేరు పెట్టారు. అది పరిస్థితులకు తగ్గట్టు కదులుతుండడంతో ముందు సైంటిస్టులు అది మొక్కేనా అని అనుమానించారు. కొన్ని చెట్ల రకాలపై పరిశోధన చేశారు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు కొన్ని మొక్కలు, చెట్లు తమకు సూట్​అయ్యే ప్రాంతానికి మారుతాయని తేల్చారు. దాంతో పాటే మరో ఆరు కొత్త నత్తలను సైంటిస్టులు కనిపెట్టారు. అందులో ఒకటి పరిస్థితులకు తగ్గట్టు రంగును, రూపును మార్చేసుకునే నత్త. దాన్నే మాడ్రెల్లా యాంఫోరా అని పిలుస్తున్నారు. కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ సైంటిస్టులు దాని జీన్స్​ను స్టడీ చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. పై నుంచి చూస్తే లోపల మొత్తం కనిపించే పారదర్శకమైన సాలీళ్లనూ కనిపెట్టారు. మెక్సికోలోని చువావా ఎడారుల్లో గుర్గించిన ఆ స్పైడర్​కు మిర్మెసికల్టర్​ చువావెన్సిస్​ అని పిలుస్తున్నారు. ఎడారుల్లో ఉండే చీమలను తిని అవి బతుకుతున్నాయని, ఇసుక తిన్నెల లోపల ఉంటాయని తేల్చారు. క్రొయేషియాలోని గుహల్లో లోలా కొనవోకా అనే ట్రాన్స్​పరెంట్​ సాలీళ్లను గుర్తించారు.
మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి