ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటో.. గడువులోగా బిహార్ ఎన్నికలు పూర్తి: సీఈసీ

ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటో.. గడువులోగా బిహార్ ఎన్నికలు పూర్తి: సీఈసీ

పాట్నా: ప్రతి ఎన్నికకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చట్ట ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ (సర్) చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను రెండ్రోజుల పాటు పరిశీలించిన సీఈసీ.. ఆదివారం (అక్టోబర్ 05) పాట్నాలో మీడియాతో మాట్లాడారు. 

బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 22 ఏండ్ల తర్వాత చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ‘‘ఓటర్లందరికీ అభినందనలు. సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రజాస్వామ్య పండుగను బిహార్ ఓటర్లందరూ ఛట్ పూజ లెక్క జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి” అని పిలుపునిచ్చారు. 

నియోజకవర్గానికి ఒకరు చొప్పున 243 మంది ఎలక్టోరల్  రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, 90,207 మంది బీఎల్‌‌‌‌‌‌‌‌వోలు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ నవంబర్ 22 వరకు ఉందని, అప్పటిలోగా ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో గరిష్టంగా 1,200 మంది ఓటర్లను కేటాయించామని పేర్కొన్నారు. 

‘‘బిహార్ అసెంబ్లీ  ఎన్నికల్లో సరికొత్త నిబంధనలు అమలు చేస్తున్నాం. ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్న 15 రోజుల్లోగా ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశాం. పోలింగ్ స్టేషన్ల దగ్గర మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో తొలిసారిగా అభ్యర్థుల కలర్ ఫొటోలు పెడుతున్నాం. ఈ నిబంధనలను రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అమలుచేస్తాం” అని పేర్కొన్నారు. కాగా, ఆధార్ సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్ కాదని, అది కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమేనని స్పష్టం చేశారు.