
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. కొలరాడో ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఆమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఓ నేత ఇలా అనర్హత వేటు పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం.. ఆయన అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అనర్హుడని కోర్టు తేల్చింది. అయిత ఈ తీర్పుపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్‌కు న్యాయస్థానం కల్పించింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.
అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 నవంబర్/డిసెంబర్ నెలల్లో అక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రతి నాలుగు సంవత్సరాల తరువాత ప్రతి జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి.. పోటీలో ఉన్నారు.