
- ఆరున్నర కోట్ల సంవత్సరాల అరుదైన సంపద
- గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి అడవుల్లో ఆరున్నర కోట్ల సంవత్సరాలనాటి అరుదైన శిలా సంపదను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కనుగొన్నారు. కెరమెరి మండలం రాం నగర్, గౌరీ అడవుల్లో ‘కాలమ్నార్ బసాల్ట్స్’గా పిలిచే శిలలను గుర్తించినట్లు బృందం సభ్యుడు గిత్తే తిరుపతి చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే నాలుగు కాలమ్నార్ బసాల్ట్స్ గుర్తించామని, కొత్తగా కెరమెరి మండలంలోని అటవీప్రాంతంలోనూ కనుగొన్నామన్నారు. భూగర్భంలో అగ్నిపర్వతం బద్దలై భూమి రంధ్రాల ద్వారా పైకి వచ్చిన లావా ప్రవాహం చల్లారుతున్న క్రమంలో ‘కాలమ్నార్ బసాల్ట్స్’ ఏర్పడుతాయన్నారు.
తెలంగాణలో మొదట 2015లో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో, 2021లో కుమ్రంభీం జిల్లాలోని బోర్ లాల్ గూడలో, 2022లో ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర జలపాతం వద్ద, 2022లోనే నిర్మల్ జిల్లా వాస్తవపూర్ గ్రామం జలపాతం వద్ద కాలమ్నార్ బసాల్ట్స్ గుర్తించామన్నారు. తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ వీటిని ‘రక్షిత ప్రదేశాలు’గా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
చరిత్ర బృందం సలహాదారుడు, సైంటిస్టు చకిలం వేణుగోపాల్ మాట్లాడుతూ.. కొలంబియా నది బసాల్ట్ గ్రూపులో ఏర్పడ్డ కాలమ్నార్ బసాల్ట్స్ 1.7కోట్ల సంవత్సరాల కిందివన్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ.. దేశంలోని అనేకచోట్ల ఈ కాలమ్నార్ బసాల్ట్స్ కనిపించినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించినవి చాలా అరుదైనవన్నారు. వీటిలో కొన్ని షడ్భుజ, పంచభుజాకారాల్లో 3 అడుగుల నుంచి 30 అడుగుల పొడవు ఉండడం విశేషమన్నారు.