ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు జనంతో పోటెత్తాయి. భక్తులు మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు. దండేపల్లి మండలం గూడెంలోని సత్యనారాయణస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్మల్​లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి కుటుంబ సభ్యలు, ఆదిలాబాద్​లో ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​ పూజలు చేశారు. ఖానాపూర్​లో మున్సిపల్ చైర్మన్​అంకం రాజేందర్, సీఐ అజయ్ బాబు, మున్సిపల్  కమిషనర్ రత్నకర్ రావు, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మహాజన్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. - వెలుగు నెట్​వర్క్

అందరికి అందుబాటులో న్యాయ వ్యవస్థ

ఆసిఫాబాద్,వెలుగు: అందరికీ న్యాయం అందుబాటులో తీసుకురావడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా జడ్జి రవీంద్ర శర్మ చెప్పారు. సోమవారం ఆసిఫాబాద్​కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్, అడిషనల్​జూనియర్ సివిల్ జడ్జి శరీన మొహమ్మద్, ఎస్పీ సురేశ్​కుమార్​తో కలిసి ప్రారంభించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు న్యాయ వ్యవస్థ మరింత దగ్గరైందన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. అడిషనల్​జడ్జి శరీనా మొహమ్మద్​మాట్లాడుతూ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలన్నారు.

ఎస్పీ సురేశ్​కుమార్​మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేక చాలామంది నిరపరాదులు.. అపరాదులుగా మారుతున్నారన్నారు. అనంతరం లీగల్ సర్వీసెస్ కన్వీనర్ గా జడ్జి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు హైకోర్టు ఉజ్జల్ బియాన్, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జడ్జి నవీన్ రావు వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలను ప్రారంభించారు. కార్యక్రమలో డీఎస్పీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్​బాబు, ప్రధాన కార్యదర్శి నరహరి, ట్రెజరర్​ శ్రీనివాస్, సీనియర్ అడ్వొకేట్లు సురేశ్, దీపక్, జగన్మోహన్ రావు, రవీందర్, జీవీఎస్ ప్రసాద్, చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

బడికి తాళం.. చెట్ల కింద విద్యార్థులు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మండలంలోని దుబ్బగూడ ప్రైమరీ స్కూల్ కు తాళం వేయడంతో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు తరలివచ్చి సమస్యను తెలిపారు. దుబ్బగూడలో పదేళ్లుగా  ప్రైమరీ స్కూల్ కిరాయి ఇంట్లో నడుస్తోంది. ఇటీవల ఇంటి ఓనర్​ఖాళీ ఓ రూమ్​కు తాళం వేసి తనే వాడుకుంటున్నాడని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై డీఈవో ప్రణీతను వివరణ కోరగా అద్దె భవనంలో స్కూల్ కొనసాగుతోందని, ఓనర్​బడికి తాళం వేయలేదని, ఒక రూం తన అవసరాల కోసం ఉపయోగించుకుంటానని చెప్పి తాళం వేసుకున్నట్లు తెలిపారు. స్కూల్​ను మరో భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

కాంట్రాక్ట్​ కార్మికులకు ఫస్ట్​ కేటగిరీ సాలరీ ఇవ్వాలి

నస్పూర్‌‌,వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఫస్ట్ కేటగిరీ సాలరీ అమలు చేసేలా జేబీసీసీఐ చర్చల్లో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సోమవారం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి. బ్రహ్మానందం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా కాంట్రాక్ట్  కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం కలకత్తాలో జరిగే 11వ వేజ్ బోర్డు చర్చల్లో కాంట్రాక్ట్​కార్మికుల కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నారు. నిరసనలో శ్రీరాంపూర్ డివిజన్ లీడర్లు యాదగిరి, అప్పారావు, శంకర్, రాజయ్య, బాపు, తిరుపతి, అప్పల రాజు, సురేశ్, బక్కయ్య, కిరణ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఐదు కోట్లతో సదర్మాట్ కాల్వకు రిపేర్లు

ఖానాపూర్​,వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ మాట్ కాల్వ మరమ్మతు కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేఖా శ్యామ్​నాయక్​తెలిపారు. సోమవారం క్యాంప్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో రూ. 51.28 కోట్లతో బీటీ రోడ్లు వేయిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ 16 కోట్లతో ప్రధాన వంతెన నిర్మిస్తామన్నారు. ఖానాపూర్ లోని రెంకులవాగుపై బ్రిడ్జి మంజూరైందన్నారు. ప్రతిపక్ష పార్టీల లీడర్లు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్​రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ సుశీల్ కుమార్, ఈఈ రామారావు, మున్సిపల్ చైర్మన్ రాజేందర్, లీడర్లు రాము నాయక్, శంకర్, డాక్టర్ కేహెచ్ ఖాన్, రాజగంగన్న, చరణ్, గంగాధర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

తిర్యాణి,వెలుగు: తిర్యాణి మండలంలోని గంభీరావుపేటలో సోమవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు మార్కెట్ యార్డ్, సీసీ రోడ్లు,  డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు బీఆర్ఎస్ సర్పంచులు స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనంతరాజు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశ్, వైస్ చైర్మన్ జగదీశ్, ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు వరలక్ష్మి తదితరులు ఉన్నారు.

నిలిచిపోయిన బొగ్గు రవాణా

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి శాంతిఖని గనిపై 18 రోజులుగా సుమారు 7 వేల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఈ వేలం ద్వారా బొగ్గు రవాణా చేయాల్సిన ఆఫీసర్లు కోల్​క్వాలిటీపై దృష్టిపెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కార్మికులు పేర్కొంటున్నారు. శాంతిఖని బొగ్గుగని నుంచి ప్రతి రోజూ నాలుగు నుంచి ఐదు వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అయితే 18 రోజులుగా తరలింపు నిలిచిపోవడంతో సింగరేణి సంస్థకు నష్టం జరిగే ప్రమాదం ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బోగ్గు రవాణాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పట్టాపాస్​బుక్​లు  ఇవ్వాలని బీజేపీ ధర్నా

మంచిర్యాల, వెలుగు: నెన్నెల శివారులోని 672 సర్వే నంబర్​లో 50 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వం పట్టా పాస్​బుక్​లు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాస్​బుక్​లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దీంతో ప్రభుత్వపరంగా రైతులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, బ్యాంక్​ లోన్లు రావడం లేదని అన్నారు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ధర్నాలో  బీజేపీ మండల అధ్యక్షుడు శైలేంద్ర సింగ్, భీమిని మండల అధ్యక్షుడు భీమయ్య, గజేందర్ సింగ్, మల్లేశ్​తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్​ది ప్రజావ్యతిరేక పాలన​

భైంసా, వెలుగు: కేసీఆర్​ది ప్రజావ్యతిరేక పాలన అని బీజేపీ లీడర్​, బాల్కొండ అసెంబ్లీ పాలక్​ ఇన్​చార్జి రామారావు పటేల్​చెప్పారు. సోమవారం భైంసాలోని ఎస్ఎస్​ ఫ్యాక్టరీలో లోకేశ్వరం మండలం బాగాపూర్​ సర్పంచ్​ గంగాధర్​(బీఆర్ఎస్), పలువురు వార్డు సభ్యులు, లీడర్లు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. బీఆర్ఎస్​ సర్కార్​సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. చాలామంది అప్పుల పాలయ్యారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ముథోల్​ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో లోకేశ్వరం ఎంపీటీసీ జయసాగర్​రావు, లీడర్లు గోపాల్ సార్డా, అబ్దుల్ రజాఖ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.

కలెక్టరేట్​ ఎదుట పశుమిత్రల ధర్నా

మంచిర్యాల, వెలుగు: జిల్లా పశుసంవర్ధక శాఖ ద్వారా గ్రామాల్లో సేవలందిస్తున్న పశుమిత్రలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. తెలంగాణ రాష్ర్ట పశుమిత్ర యూనియన్​ జిల్లా అధ్యక్షురాలు ఇరుసుల్ల శ్రీలత మాట్లాడుతూ.. రాష్ర్టవ్యాప్తంగా 2500 మంది పశుమిత్రలు పనిచేస్తున్నారని తెలిపారు. తమకు కేటాయించిన గ్రామంతో పాటు సబ్​ సెంటర్​ పరిధిలోని గ్రామాలకు వెళ్లి రైతులకు సేవలందిస్తున్నామని అన్నారు. కానీ ప్రభుత్వం తమకు ఎలాంటి పారితోషికం ఇవ్వడం లేదన్నారు. పశుమిత్రలకు పారితోషికం, లేదా వేతనం నిర్ణయించాలని, జీవో 60 ప్రకారం జీతాలు ఇవ్వాలని, ఈఎస్​ఐ, పీఎఫ్​ సౌకర్యం కల్పించాలని, టీఏ, డీఏలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు.