ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

లోకేశ్వరం,వెలుగు: లోకేశ్వరం మండల సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. ఎంపీపీ లలిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు సమస్యలపై ఆఫీసర్లను నిలదీశారు. గవర్నమెంట్​డబ్బులు సర్పంచుల పర్సనల్ ఖాతాల్లో ఎలా జమచేస్తారని ఎంపీఈవోను నిలదీశారు. ఆడిట్ సమయంలో ఖాతాల్లో డబ్బులు ఎక్కడివని అడిగితే ఏమని చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యల మెడల్లోని పుస్తెల తాళ్లు అమ్మి అభివృద్ధి పనులు చేశామన్నారు. గడ్​చందా, జామ్ని(కె) గ్రామాల్లో మంచినీటి సరఫరా సరిగా లేదని సర్పంచ్​ వెంకట్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు చేపపిల్లల పంపిణీ గాలికొదిలేశారని సర్పంచులు భుజంగరావు, నరేశ్, వెంకట్​రావు, ముత్తా గౌడ్ పేర్కొన్నారు. ఆయాశాఖల ఆఫీసర్ల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పీఏసీఎస్​చైర్మన్ రత్నాకర్ రావు, ఇన్​చార్జి ఎంపీడీవో సాల్మన్ రాజ్, కో ఆప్షన్ మెంబర్లు కళ్యాణ్, ప్రకాశ్​తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పట్టని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

బెల్లంపల్లి రూరల్,వెలుగు: భీమిని మండలంలోని చిన్న గుడిపేట, పెద్ద గుడిపేట గ్రామాలకు రోడ్డు వేయించలేని ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప రాజీనామా చేయాలని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ, సిర్పూర్ నియోజకవర్గ ఇన్​చార్జి పాల్వాయి హరీశ్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం చిన్నగుడిపేట నుంచి బెల్లంపల్లి వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ర్యాలీని లీడర్లు హరీశ్​రావు, కొయ్యల ఏమాజీ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్లు వేయలేని బీఆర్ఎస్​లీడర్లు ఓట్లు అడగానికి అర్హత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి  ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులు వస్తున్నా.. స్థానిక ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదన్నారు. కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టర్ ఎదుట ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు భీమయ్య, పేసరి లింగమూర్తి, ఉప సర్పంచ్ మేకల బుచ్చయ్య, అజ్మీర శ్రీనివాస్, నవీన్, బొండ్ల తిరుపతి, రంగు సాయి, రెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు.

జైనూర్ కు చేరిన గంగాజల యాత్ర

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ​నాగోబా జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయులు చేపట్టిన గంగాజల యాత్ర శుక్రవారం జైనూర్ మండలం లెండిజాల గ్రామానికి చేరింది. ఆదివాసీలు ఒకరివెనుక ఒకరు వరుసగా రోడ్డుపై వస్తున్న తీరు ఆకట్టుకుంది. - జైనూర్, వెలుగు

జంగుబాయి ఆలయ అభివృద్ధికి కృషి

ఆసిఫాబాద్(కెరమెరి),వెలుగు: కెరమెరి మండలం మహారాజ్ గుడాలోని జంగుబాయి ఆలయంలో శుక్రవారం మహాపూజ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ , ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్​పేయ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు , మాజీ ఎంపీ గెడం నగేశ్, ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు పూజలు నిర్వహించారు. పుణ్య క్షేత్రం  అభివృద్ధికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జంగుబాయి ఉత్సవాలకు గవర్నమెంట్ ఏటా రూ.10 లక్షలు మంజూరు చేస్తుందన్నారు.

అట్టహాసంగా డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

బెల్లంపల్లి, వెలుగు: స్థానిక రైల్వే గ్రౌండ్​లో రైల్వే ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను దక్షిణ మధ్య రైల్వే బెల్లంపల్లి అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్​శశాంక్ యాదగిరి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. కార్యక్రమంలో రైల్వే ఇన్​స్టిట్యూట్​సెక్రటరీ రమేశ్, జాయింట్ సెక్రటరీ సాల్మన్, స్టేషన్ మేనేజర్ రవీందర్, రైల్వే కార్మిక లీడర్లు నాగరాజు, సాంబశివుడు, ఆఫీసర్లు బుచ్చిబాబు, హరిబాబు, సీహెచ్ అనిల్, జి. రమేశ్, శ్యాం పాల్గొన్నారు.

ఏడు మార్కులు కలిపి మెయిన్స్​ అనుమతించాలి  

మంచిర్యాల, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్  ఎంపిక పరీక్షలో తప్పుడు ప్రశ్నలకు ఏడు మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సై, కానిస్టేబుల్​ ఫిజికల్​ టెస్టులో లాంగ్​జంప్​ను తగ్గించాలన్నారు. ప్రిలిమ్స్​లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏడు మార్కులు కలిపి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలన్నారు. పీడీఎస్​యూ, ఎస్​ఎఫ్​ఐ, ఏఐఎస్​ఎఫ్​ నాయకులు డి.శ్రీకాంత్, మిట్టపల్లి తిరుపతి, కనుకుంట్ల సన్నిగౌడ్, రాహుల్, వంశీ, యూసఫ్, చరణ్ పాల్గొన్నారు. 

రాగిజావ, బెల్లంపొడి పంపిణీ  

మంచిర్యాల, వెలుగు: బెంగళూరులోని సత్యసాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ద్వారా అందించిన రాగిజావ, బెల్లంపొడి ప్యాకెట్లను వెరబెల్లి ఫౌండేషన్​ సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్నామని డీఈవో ఎస్​.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫౌండేషన్​ చైర్మన్​ రఘునాథ్​రావు ట్రాలీ ఏర్పాటు చేయడంతో పాటు హమాలీ ఖర్చులను భరించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రఘునాథ్​రావు, సైన్స్ ఆఫీసర్​ మధుబాబు, తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్, జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గని రవికుమార్ పాల్గొన్నారు.  

పత్తి రైతులను ఆదుకోవాలి

ఆదిలాబాద్,వెలుగు: గిట్టుబాటు ధర కల్పించి పత్తిరైతులను ఆదుకోవాలని అఖిలపక్ష రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దారుట్ల కిష్టు డిమాండ్​చేశారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉద్యమ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈనెల12న మార్కెట్ యార్డు వద్ద ధర్నా నిర్వహించడానికి తీర్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం లీడర్లు పొశెట్టి, బండి దత్తాత్రి, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.

‘భగీరథ’ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

ఆసిఫాబాద్,వెలుగు: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లరి లోకేశ్​మాట్లాడుతూ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం బానిసలుగా చూస్తున్నాయన్నారు.