ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

రామడుగు, వెలుగు: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని నలుగురు కుటుంబసభ్యులు ఏలుతున్నారని, కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ విముక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ నెల 15న కరీంనగర్​లో జరిగే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు.

రామడుగు బీజేపీ మండల అధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ ఆధ్వర్యంలో వెదిర గ్రామంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముగింపు సభను సక్సెస్​చేసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. కార్యక్రమంలో తిరుమలపూర్ ఎంపీటీసీ రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాంకిషన్, శక్తి కేంద్ర ఇన్​చార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ సభను సక్సెస్ చేయాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ, కుటుంబ పాలనపై బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ సమరశంఖం పూరించారని హైదరాబాద్​మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి అన్నారు. ఈనెల 15న జరగనున్న బీజేపీ సభను సక్సెస్​చేయాలని మంగళవారం బీజేపీ శ్రేణులతో కలిసి కార్తీకరెడ్డి కాపువాడ, హోసింగ్ బోర్డ్ కాలని  ఏరియాల్లో  ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించారు. ఆమె మాట్లాడుతూ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో  కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్ల రమేశ్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఉమారాణి పాల్గొన్నారు.

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి 

మానకొండూర్, తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్​జిల్లా తిమ్మాపూర్​మండలంలో వేర్వేరు ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఉరేసుకోగా, మరొకరు పురుగుమందు తాగి చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలు మంగళవారం జరిగాయి. సీఐ రవీందర్ కథనం మేరకు.. కొండపలకల గ్రామానికి చెందిన రవీందర్(27) మానసిక ఒత్తిడితో మనస్తాపంతో సోమవారం పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రవీందర్ ను కుటుంబసభ్యులు కరీంనగర్ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉరేసుకొని ఒకరు.. 

మండలంలోని కెల్లెడ గ్రామానికి చెందిన ఏరుకొండ రమేశ్(38) ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం... రమేష్ గౌడ కులవృత్తి చేసుకొని జీవిస్తున్నాడు. సొంతూరులో రెండేండ్ల ఇల్లు కట్టగా అప్పులు అయ్యాయి. మానసికంగా కుంగిపోయి తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో మంగళవారం గ్రామంలోని ప్రభుత్వ స్కూల్​పక్కనున్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఓ స్థానికుడు కుటుంబసభ్యులకు సమాచారమివ్వడంతో వారు కరీంనగర్​హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయినట్లు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు.

బైక్​ ఢీకొని వృద్ధురాలు.. 

తిమ్మాపూర్, వెలుగు: రోడ్డు దాటుతుండగా బైక్​ఢీకొని ఓ వృద్ధురాలు చనిపోయింది. ఏఎస్సై నజీమ్​ఓద్దీన్​ కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామంలో ఎల్కతుర్తి మల్లమ్మ(65) రోడ్డు దాటుతుండగా కరీంనగర్​వైపు వెళుతున్న ఓ బైక్​ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడడంతో ఆమె స్పాట్​లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్​బాడీని కరీంనగర్​ హాస్పిటల్​కు తరలించారు. కుమారుడు రామయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై కేసు నమోదు చేశారు. 

సమాజం తలదించుకొనేలా ‘బండి’ మాటలు: జగిత్యాల ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్

జగిత్యాల, వెలుగు:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని, హైందవ సంస్కృతి పార్టీ నాయకుడు సంస్కారం మరిచి బజారు మనిషిలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీస్ లో  మీడియాతో మాట్లాడుతూ బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్.. మహిళా ఎమ్మెల్సీ అనే గౌరవం లేకుండా అసభ్య పదజాలాలతో కవితను విమర్శించడం బాధాకరమన్నారు.

అభిమానులు ఆమెను పులిబిడ్డగా పోలుస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే బండి సంజయ్ వ్యంగ్యంగా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. బతుకమ్మ పాటల్లోనూ అశ్లీలం ఉందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఏ పాటలో అశ్లీలం కనిపించిందని అని బండి సంజయ్​ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

దళితుల భూములను లాక్కుంటున్నరు.. : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో  గ్రామాల్లో క్రీడా మైదానాల పేరిట ప్రభుత్వం దళితుల భూములను లాక్కుంటోందని, చెరువులు, కుంటలలో మట్టితో నింపి, మత్స్యకారుల పొట్ట కొడుతోందని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్లాపూర్ మండలం వెంపల్లికి చెందిన మత్స్య కార్మికులు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జీవన్​రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంపల్లి గ్రామంలో దశాబ్దాలుగా 120 గంగపుత్ర కుటుంబాలు ఎర్రకుంట చెరువులో చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గ్రామ సర్పంచ్ చెరువును మట్టితో పూడ్చేసి క్రీడా మైదానంగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో వినోద్ కుమార్ కు వినతిపత్రం  అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్ రెడ్డి, ప్రవీణ్, శాకీర్,  లింగారెడ్డి, లింగం, గ్రామస్థులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

8ఏండ్లలో ఒక్క రూపాయి కేటాయించలే..

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటినా స్కూల్ గేమ్ ఫెడరేషన్ కు ఒక్క రూపాయి కేటాయించలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. క్రీడలకు నిధులు కేటాయించక క్రీడా మైదానాల పేరిట ప్రజలు, యువతను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

మార్చిలో లక్షమంది స్టూడెంట్లతో మహా ప్రదర్శన : ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ

జగిత్యాల, వెలుగు:  విద్యారంగం, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు. మంగళవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 9,10,11 తేదీల్లో  జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభలను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ మహాసభలలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొని రాష్ట్రంలో నిరుద్యోగం, శాంతి భద్రతల సమస్యలపై చర్చించామన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏండ్లలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రంలోని విద్యారంగం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు మార్చిలో లక్ష మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రాపాక సాయికుమార్, మల్యాల రాకేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేణి సునీల్, నవీన్, పట్టణ కార్యదర్శి నందు పాల్గొన్నారు.