ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  •     ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి
  •     అభివృద్ధి పనులలో నాణ్యత ఉండాలి
  •     సమీక్ష సమావేశంలో మినిస్టర్​గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: రైతుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ఈ నేపథ్యంలో రైతులు ఆయిల్ పామ్ పై మొగ్గు చూపాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి  మాట్లాడారు. అవసరాన్ని బట్టి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోలు కేంద్రాల్లో  ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. త్వరగా దిగుబడినిచ్చే పంటలపై అధికారులు దృష్టిసారించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రోత్సహకాన్ని కూడా అందిస్తుందన్నారు. రోడ్లపై ఉన్న పోల్స్, టవర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. 

క్వాలిటీలో కాంప్రమైజ్ కావొద్దు..

నగరంలో డే అండ్ నైట్ కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, క్వాలిటీ లేని పనులకు బిల్లులు చెల్లించొద్దని ఆదేశించారు. రాబోయు ఐదేళ్లలో ఎలాంటి రిపేర్లు లేకుండా చూడాలన్నారు. అనంతరం దళితబంధుపై రూపొందించిన లఘుచిత్ర  ప్రెజెంటేషన్ ను తిలకించారు. అనంతరం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభించారు. అలాగే స్థానిక డిస్ట్రిక్ట్ లైబ్రరీలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు స్థానిక 11వ డివిజన్ లో రూ14.2లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, ఆడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ చైర్ పర్సన్ విజయ, డిప్యూటీ మేయర్ స్వరూపరాణి, లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, సుడా చైర్మన్ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. 

నాణ్యత లేని చేప పిల్లలతో నష్టంఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు: దళారులు పంపిణీ చేస్తున్న చేప పిల్లలతో మత్స్యకారులు నష్టపోతున్నారని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇంధిరా భవన్ లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలం పద్ధతి లేకుండా చెరువులు, కుంటలపై ఆధారపడిన మత్స్యకారుల సంఘాలకు హక్కులు కల్పించి, కుల వృత్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సర్కార్ 2018 ఎన్నికల సమయంలో మత్స్యకారులకు రాయితీపై వాహనాలు అందించి నిలిపివేశారని, తిరిగి పున:ప్రారంభించాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలను మరమ్మతు చేపట్టాలని ఆఫీసర్లకు సూచించారు. సమావేశంలో  కాంగ్రెస్ జగిత్యాల మండలాధ్యక్షుడు జున్ను రాజేందర్, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, రమేశ్, కాంగ్రెస్ మత్స్యకారుల విభాగం జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

లంచం తీసుకుంటే జైల్లో పెడతం

మండల సభలో ఎమ్మెల్యే రవిశంకర్​

చొప్పదండి,వెలుగు: దళిత బంధు యూనిట్ల మంజూరులో ఎవరైనా రుపాయి లంచం తీసుకున్నా జైల్లో పెడతామని చొప్పదండి ఎమ్మెల్యే ఎస్.రవిశంకర్ హెచ్చరించారు. సోమవారం ఎంపీపీ రవీందర్ అధ్యక్షతన ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గానికి 500 దళిత బంధు యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమావేశం వాడివేడిగా జరిగింది. మండలంలోని రైతులు ధరణితో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని రాగంపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి ఆరోపించారు. ఫ్యాక్స్, ఐకేపీ కేంద్రాల్లో బస్తాకు కేజీన్నర చొప్పున క్వింటాల్​కు నాలుగు కిలోలు అదనంగా ఎలా తూకం వేస్తారని ఎంపీపీ, ఎంపీటీసీలు ప్రశ్నించారు. చాకుంటలో మిషన్ కాకతీయ పనులు పూర్తి చేయకున్నా పూర్తయినట్లు ఎలా రికార్డ్ చేస్తారని సర్పంచ్ పెద్ది శంకర్ ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీటీసీ సౌజన్య, ఏఎంసీ చైర్మన్​ చుక్కారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

జీఓ 76ను త్వరగా అమలు చేయండి

చీఫ్ సెక్రెటరీని కోరిన రామగుండం ఎమ్మెల్యే

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ప్రాంతంలోని స్థలాల్లో దశాబ్దకాలంగా నివాసాలు ఏర్పరుచుకున్న కార్మికుల కోసం జీఓ 76ను త్వరగా అమలు చేసి, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. సోమవారం ఆయన రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి పలు సమస్యలు వివరించారు. రామగుండంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సానుకులంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

పోలీస్​ స్టేషన్​ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మల్యాల, వెలుగు: తనపై, తన అన్నపై దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదనే మనస్థాపంతో రవీందర్ రెడ్డి అనే యువకుడు సొమవారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు కథనం ప్రకారం.. మండలంలోని కొండగట్టుకు చెందిన రాజేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి అన్నదమ్ములు. కొద్దిరోజుల నుంచి వీరు కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారు. నవంబర్​18న కొండగట్టు గుట్ట కింద తన అన్న రాజేశ్వర్ రెడ్డిపై మల్లేశం, శ్రీను మరికొందరు దాడికి యత్నించగా రవీందర్ రెడ్డి ఫోన్ లో చిత్రీకరించాడు. దీంతో సదరు వ్యక్తులు ఫోన్ లాక్కుని పోలీసులకు అందజేశారు. అకారణంగా దాడి చెయ్యడమే కాకుండా ఫోన్ లాక్కున్నారని రవీందర్​రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోకపోవడమే కాక ఆటోను సీజ్ చెయ్యడంతో మనస్తాపానికి గురైన రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగాడు. దీంతో స్థానికులు అతడిని హాస్పిటల్ కు తరలిచారు. ఈ విషయమై ఎస్ఐ చిరంజీవిని వివరణ కోరగా కొండగట్టు ఆటో యూనియన్ వద్ద జరిగిన గొడవలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని, పేపర్లు సరిగా లేకపోవడంతో ఆటోలు సీజ్ చేసామని తెలిపారు.

చర్యలు తీసుకోవాలని ఏసీపీకి కార్పొరేటర్ల ఫిర్యాదు 

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: తాము ఉల్లాసంగా డాన్స్​చేసిన పాటలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సోమవారం టౌన్ ఏసీపీ శ్రీనివాస్ రావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం తాము పిక్నిక్ కు వెళ్లి ఉత్సాహంగా గడిపామని, తమకు నచ్చిన తెలంగాణ ఉద్యమ పాటలపై డాన్స్ చేశామన్నారు. అయితే కొందరు ఆయా వీడియోలలోని పాటలు మార్చి వేరే పాటలు చేర్చారని, అవి వైరల్ చేయడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కార్పొరేటర్లు ఏసీపీని కోరారు.

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణిలో కలెక్టర్ అనురాగ్ జయంతి 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: -ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజావాణికి మొత్తం 32 దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓలు శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, ఆఫీసర్లు పాల్గొన్నారు.

అర్హులకు డబుల్​ బెడ్రూంలు ఇవ్వాలి

అర్హులై ఉండి డ్రాలో పేర్లురాని వారికి డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్​డిమాండ్​ చేశారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్​ముందు అర్హులైన మహిళలలో కలిసి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్​అనురాగ్ జయంతికి వినతి పత్రం సమర్పించారు. డ్రా పద్ధతిలో ఎంపిక చేయడం వలన డబుల్ ఇండ్లకు అర్హులై ఉండి కూడా దాదాపు 900 పైచిలుకు మందికి ఇండ్లు రాలేదన్నారు. ధర్నాలో సీపీఎం పట్టణ కార్యదర్శి శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యుడు రమణ, నాయకులు రాజశేఖర్, పోచమల్లు, పద్మ తదితరులు పాల్గొన్నారు. 

కరీంనగర్ టౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ తెలిపారు. సోమవారం  కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి 157 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, డీఎంహెచ్ఓ జువేరియా తదితరులు పాల్గొన్నారు.  

జగిత్యాల రూరల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల కావస్తున్నా కొనుగోలు ప్రక్రియ నత్తనడకగా సాగుతుందని రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్​రెడ్డి అన్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రవికి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఆయన వెంట రైతు ఐక్యవేదిక నాయకులు  తిరుపతి, భూంరెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారు.

ఎస్సీకాలనీల్లోబీజేపీ బస్తీ సంపర్క్​

జమ్మికుంట, వెలుగు : పట్టణంలోని ఎస్సీ కాలనీలలో సోమవారం పట్టణ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపర్క్ అభియాన్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ బాలారెడ్డి ఇంటింటికి వెళ్లి మోడీ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు మల్లేశ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేశ్, స్వామి పాల్గొన్నారు. 

బండలింగాపూర్ ను మండల కేంద్రం చేయండి

మెట్ పల్లి, వెలుగు: సంస్థాన్ బండలింగాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్తులు చేపడుతున్న రిలే దీక్షలు సోమవారం100వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మహాత్మాగాంధీ, సుభాశ్​చంద్రబోస్ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల కేంద్రంగా చేయడానికి తమ గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కలెక్టర్ రవికి దృష్టికి తీసుకెళ్లామన్నారు. బండలింగపూర్ ను మండల కేంద్రం చేస్తే చుట్టూ ఉన్న గ్రామాలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల సాధన కమిటీ అధ్యక్షుడు భూమయ్య , సర్పంచ్ అంజయ్య, ఉప సర్పంచ్ రాజ్యం, ఎంపీటీసీ స్వప్న, మాజీ సర్పంచ్ గంగాస్వామి, నాగార్జున గౌడ్, హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు.

స్టూడెంట్లు నైపుణ్యాలు పెంచుకోవాలి

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య  

రాజన్న సిరిసిల్ల, వెలుగు: స్టూడెంట్లు నైపుణ్యాలు పెంచుకోవాలని మున్సిపల్ కమిషనర్​వెల్దండి సమ్మయ్య అన్నారు. సోమవారం ఆయన సిరిసిల్ల పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో జరిగిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్​ ఫేర్ కార్యక్రమాన్ని విజిట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా కృష్ణవేణి స్కూల్​స్టూడెంట్లు వేస్టేజీతో వివిధ రకాల నమూనాలు తయారు చేయడం అభినందనీయమన్నారు. వ్యర్థానికో అర్థం చెప్పేవిధంగా విద్యార్థులు తయారు చేసి మెటీరియల్ ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అనంతరం  మంచి నమూనాలను రూపొందించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆయన ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, కౌన్సిలర్ శైలజ, టీచర్లు ఉన్నారు.