ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

బెయిల్ వచ్చినా చోరీలు ఆపలే

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ఇటీవల బెయిల్ పై బయటకువచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్​ఎస్పీ శరత్ చంద్ర పవార్  వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో సీసీఎస్, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పందంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులు ఏపీలోని వెస్ట్​గోదావరి జిల్లా ఏలూరు మండలం తంగిళ్లమూడి గ్రామానికి చెందిన షేక్ మొహిద్దీన్ అలీ, హైదరాబాద్ సాగర్​రోడ్​కు చెందిన అడప ఆనంద్ కుమార్, విజయవాడకు చెందిన గుర్రం దుర్గగా గుర్తించారు. వారి నుంచి 16 తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు రూ.8.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇండ్లే టార్గెట్​గా దొంగతనాలకు పాల్పడుతున్నారు.  నిందితుల్ని పట్టుకున్న మహబూబాబాద్ సీసీఎస్ ఇన్స్ పెక్టర్ మోహన్, డోర్నకల్ ఇన్స్ పెక్టర్ వెంకటరత్నం, ఎస్ఐలు శివ, శ్యామ్ సుందర్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

సీఎం సార్ ​వస్తుండు.. వర్క్స్ కంప్లీట్ చేయాలి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ పట్టణంలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై ఆయన రివ్యూ చేశారు. పట్టణంలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన ఉన్నందున పరిశుభ్రతపై దృష్టిసారించాలన్నారు. ప్లాంటేషన్, ఫుట్ పాత్ డివైడర్లు అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని కోరారు. మొక్కలకు నీళ్లు పోసి, పచ్చదనం పెంచాలన్నారు. అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వ ఉండకుండా ఇంజనీరింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల రేడియం స్టిక్కర్లు వేయించాలని, జంక్షన్ల వద్ద జీబ్రా క్రాసింగ్ లకు, డివైడర్లకు పెయింట్ వేయించాలన్నారు. మెయిన్ రోడ్లపై గోడలకు, ప్రభుత్వ ఆఫీసుల గోడలకు రంగులు వేయించాలన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నాటుతున్న మొక్కలు అందంగా కనిపించాలన్నారు. బంధం చెరువులో గుర్రపు డెక్క ను తొలగించాలని, చెరువు చుట్టూ ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని పారిశుధ్యంపై దృష్టిసారించాలన్నారు. రివ్యూలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్పీసీఈవో రమాదేవి, డీఆర్​డీఏ పీడీ సన్యాసయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులున్నారు.

ఎమ్మెల్యేకు ఎఫ్ఆర్వో సారీ

మండల సభలో క్షమాపణ చెప్పిన కొండల్ రెడ్డి

బచ్చన్నపేట, వెలుగు: బచ్చన్నపేట మండల సభలో ఎఫ్ఆర్ వో కొండల్ రెడ్డి ఎమ్మెల్యే, సర్పంచ్ కు సారీ చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బచ్చన్నపేట మండలం చిన్నరామచర్లలో కొండముచ్చు 30మందిపై దాడి చేయగా.. స్థానిక మహిళా సర్పంచ్​ఎఫ్ఆర్వో కొండల్​రెడ్డికి ఫోన్ చేశారు. ఈక్రమంలో కొండల్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని సర్పంచ్​ ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఫిర్యాదు చేయగా.. ఆయన కూడా ఎఫ్ఆర్వోకు ఫోన్ చేశారు. ఈక్రమంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. సోమవారం బచ్చన్నపేటలో ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి అధ్యక్షతన మండలసభ నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. ఎఫ్ఆర్ వో కొండల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అందరి సహకారంతో తీర్మానం చేశారు. అక్కడే కూర్చున్న కొండల్ రెడ్డి ఎమ్మెల్యే ముందుకువచ్చి క్షమాపణలు తెలిపారు. అనంతరం మండల సర్పంచులాంతా ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ ఆఫీసర్లు సర్పంచుల మాట వినడం లేదని మండిపడ్డారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఇర్రి రమణారెడ్డి, జడ్పీవైస్ చైర్మన్​గిరబోయిన భాగ్యలక్ష్మి,ఎంపీడీవో రఘురామకృష్ణ ఉన్నారు. ఇదిలా ఉండగా.. చిన్నరామచర్లలో సంచరిస్తున్న కొండముచ్చును ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు.

బెల్ట్ షాపులు మూసేయకుంటే దాడులు చేస్తాం

భీమదేవరపల్లి, వెలుగు: రెండు వారాల్లో బెల్ట్ షాపులు మూసివేయకుంటే ప్రత్యక్ష దాడులకు దిగుతామని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంద సదాలక్ష్మి హెచ్చరించారు. సోమవారం హనుమకొండ జిల్లా వంగరలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ప్రతి పల్లెలో పదుల సంఖ్యలో బెల్టు షాపులు వెలిశాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలను మత్తుకు బానిస చేస్తోందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు, హింసలకు అధిక శాతం మద్యమే కారణమవుతోందన్నారు. బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుంటే మహిళలతో కలిసి దాడులు చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీకి పేదలపై ప్రేమ లేదు

నెక్కొండ, వెలుగు: బీజేపీకి పేదలపై ప్రేమ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్​చైర్మన్ బోయినపల్లి వినోద్​కుమార్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి​అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడలో పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ప్రధాని మోడీ పార్లమెంటులో సింగరేణిని ప్రైవేటుపరం చేస్తానని చెప్పి, రామగుండంలో మాత్రం అలా చేయమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ పెత్తందార్ల పార్టీ అని విమర్శించారు. కేంద్రం తెలంగాణలోని మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్లు సంపత్​రావు, రాము తదితరులున్నారు.

ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్ బయటకు..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

నర్సంపేట,  వెలుగు: ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకువస్తారని బీజేపీ స్టేట్ లీడర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నర్సంపేట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కార్యకర్తలంతా ఇప్పటినుంచే కష్టపడి పనిచేయాలని కోరారు. తెలంగాణలోని ప్రతి పనిలో కేంద్ర నిధులు ఉన్నాయని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్​తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బాల్నే జగన్, ఆ పార్టీ లీడర్లు వడ్డెపెల్లి నరసింహరాములు, రేసు శ్రీనివాస్, కొంపెల్లి రాజు, మల్యాల సాంబమూర్తి ఉన్నారు.